Share News

Kaloji Narayana Rao: శిథిలావస్థలో ‘ప్రజాకవి’ కాళోజీ ఇల్లు

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:23 AM

పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది’ అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి.. కాళోజి. ఆయన బతికున్న రోజుల్లో హనుమకొండలో నివసించిన ఇల్లు ఒక సాహిత్య లోగిలిగా వెలుగొందింది.

Kaloji Narayana Rao: శిథిలావస్థలో ‘ప్రజాకవి’ కాళోజీ ఇల్లు

  • కలగా స్మారక మందిర నిర్మాణం

  • పట్టించుకోని ప్రభుత్వం

  • నెరవేరని గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హామీలు

హనుమకొండ/హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ’పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది’ అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి.. కాళోజి. ఆయన బతికున్న రోజుల్లో హనుమకొండలో నివసించిన ఇల్లు ఒక సాహిత్య లోగిలిగా వెలుగొందింది. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి, అణిచివేత-అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన కాళోజీ నారాయణ రావు.. తుది శ్వాస విడిచేవరకు నివసించిన నక్కలగుట్టలోని ఆయన నివాసం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. కాళోజీ మరణించిన తర్వాత.. ఇంటిలో సగభాగం కూలిపోయి, మరమ్మతులు లేక కళావిహీనంగా తయారయింది. ఆయన కుమారుడు చనిపోయిన తర్వాత.. ప్రస్తుతం ఆ ఇల్లు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. కాళోజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ కూడా భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా కాళోజీ ఇంటిని తీర్చిదిద్దుతామని చేసిన వాగ్దానం నెరవేరలేదు. ఇటీవలే ఇతర రాష్ట్రాలకు చెందిన రచయితలు వరంగల్‌ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి కాళోజీ నివసించిన ఇంటిని చూసేందుకు వెళ్లారు. అంతటి మహనీయుడి ఇల్లు దయనీయ స్థితిలో ఉండడం చూసి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటిని స్వాఽధీనం చేసుకుని స్మారక మందిరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.


కాళోజీ కథల పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

తెలంగాణ సాహిత్య ఆకాడమీ ప్రచురించిన ’కాళోజీ కథలు’ పుస్తకాన్ని సోమవారం సచివాలయం లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాహిత్య రంగానికి, తెలంగాణ భాషకు కాళోజీ చేసిన కృషిని కొనియాడారు. ’నా గొడవ’ అనే పుస్తకంలో కవిత్వమే కా కుండా సాహిత్యంలోని అనేక అంశాలను స్పృశించారని అన్నారు. ఆయన 111వ జయంతి సందర్భంగా ప్రజాకవి రాసిన కథలను ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం మంచి ప్రయత్నమని అకాడమీ అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ నామోజు బాలాచారి, కవి యాకుబ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 04:23 AM