Dr Nandakumar Reddy Resigned: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీరాజీనామా!
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:22 AM
కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉప కులపతి వైస్ చాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను ప్రభుత్వానికి పంపారు....
పీజీ వైద్య విద్య పరీక్ష ఫలితాల్లో అక్రమాలపై తీవ్ర దుమారం నేపథ్యంలో..
వర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విచారణలో వెల్లడి.. ప్రభుత్వానికి రాజీనామా లేఖ పంపిన వైస్ చాన్సలర్
ఈ ఏడాది మార్చి 18న వీసీగా నియమితులైన డాక్టర్ నందకుమార్ రెడ్డి
కాళోజీ వర్సిటీ వ్యవహారంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉప కులపతి(వైస్ చాన్సలర్) డాక్టర్ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను ప్రభుత్వానికి పంపారు. ఇటీవల విడుదలైన పీజీ వైద్య విద్య పరీక్షా ఫలితాల్లో ఓ విద్యార్థి నిబంధనలకు విరుద్ధంగా పాసైన ఘటన తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపించింది.
హెల్త్ యూనివర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆ విచారణలోనూ తేలింది. దీంతో మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాగా డాక్టర్ నందకుమార్ రెడ్డిని ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 18న హెల్త్ యూనివర్సిటీ వీసీగా నియమించింది. సరిగ్గా 8 నెలల 10 రోజులకు ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక, డాక్టర్ నందకుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినాను కలిశారని, ఆ తర్వాత డాక్టర్ క్రిస్టినాతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును కలిశారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
పారదర్శకంగా పని చేయాలి: సీఎం
మరోవైపు కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్‌చార్జిల నియామకం తదితర అంశాల్లో వస్తున్న ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమేస్య లేదని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసే వారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా, పీజీ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి కాళోజీ వర్సిటీలో జరిగిన అవినీతి బాగోతంపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు రాష్ట్ర గవర్నర్‌తోపాటు జాతీయ విద్యా మండలి(ఎన్‌ఎంసీ) చైర్మన్‌కు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Telangana High Court: ఎన్నికల ప్రక్రియను ఆపలేం
Panchayat Elections: సర్పంచ్‌గిరి.. వేలం వెర్రి!