Thummala: నేనున్న క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం తుది నివేదిక రాలేదు
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:31 AM
తాను ఉన్న మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదిక రాలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ మంజూరు అంశమూ క్యాబినెట్ ముందుకు రాలేదని చెప్పారు.
కమిషన్ ముందు ఈటల అబద్ధాలు: తుమ్మల
‘ముఖాముఖి’లోనూ పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తాను ఉన్న మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదిక రాలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ మంజూరు అంశమూ క్యాబినెట్ ముందుకు రాలేదని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అసత్యాలు మాట్లాడారన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో తుమ్మల కాసేపు చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ మంగళవారం రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందని, బహుశా వివరాలను ప్రభుత్వం కమిషన్‌కు ఇప్పటికే ఇచ్చి ఉంటుందని చెప్పారు. ప్రాణహితతో పాటుగా అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారన్నారు. రైతు భరోసా విషయంలో బీఆర్‌ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని తుమ్మల ఓ ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రోజుల తరబడి, నెలల తరబడి రైతుబంధు నగదు బదిలీ చేపట్టిన సందర్భాలున్నాయని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు రోజుల వ్యవధిలో రూ.5 వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిందని చెప్పారు.
50కి పైగా వినతి పత్రాల స్వీకరణ
గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తుమ్మల వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు మంత్రితో ముఖాముఖిలో పాల్గొని.. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించానని చెప్పారు. జిల్లా కలెక్టర్లు సహా పలువురు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించాలంటూ సూచించానని తెలిపారు. మొత్తం 50 మందికి పైగా బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించినట్లు వెల్లడించారు. కాగా.. ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో భాగంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పాల్గొని బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.