BJP National President K Laxman: వ్యవస్థలో మార్పే అసలైన పరీక్ష
ABN , Publish Date - May 22 , 2025 | 06:54 AM
ఫిజీలో జరిగిన ఆసియా-పసిఫిక్ పీఏసీ వర్క్‌షాప్‌లో బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. పీఏసీల లక్ష్యం తప్పులను ఎత్తిచూపడమే కాకుండా, వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కూడా అనివార్యమని అన్నారు.
ఫిజీలో ఆసియా- పసిఫిక్ పీఏసీల వర్క్‌షా్‌పలో బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)ల లక్ష్యం తప్పులను ఎత్తి చూపడమే కాదని.. వ్యవస్థలో మార్పు తీసుకురావడమే వాటికి అసలైన పరీక్ష అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, ఫిజీ రిపబ్లిక్ పార్లమెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఆసియా పసిఫిక్ ప్రాంతీయ వర్క్‌షా్‌పలో భారత్ నుంచి డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. మొత్తం 11 దేశాల ఎంపీలు హాజరైన ఈ సదస్సులో... ప్రజాపద్దు సంఘాల పనితీరు, ప్రభావం, వాటి సమగ్రతను మెరుగు పరచడం అనే అంశాలపై బుధవారం జరిగిన వర్క్‌షా్‌పలో ఆయన ప్రసంగించారు. పార్లమెంటరీ వ్యవస్థలో పీఏసీల పాత్ర చాలా కీలకమని చెప్పారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసిన తీరుపై సమగ్రంగా పరిశీలన చేయడం చట్టసభల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. దీంట్లో పీఏసీలదే ముఖ్య పాత్ర అని తెలిపారు. పీఏసీ సభ్యులు తమ అధ్యయనాల సందర్భంగా నేరుగా క్షేత్రస్థాయికి వెళతారని, అక్కడ పథకాల అమలు కూడా పరిశీలిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రజల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవిక సమాచారం కూ డా తీసుకుంటారన్నారు. పీఏసీల సిఫార్సులు తాత్కాలికమే అయినా.. వాటి అమలు కోసం చేపట్టిన చర్యల నివేదికల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు.
సుమోటోగా పరిశీలన..
ఇటీవల కాలంలో పీఏసీలు ఆడిట్‌లో లేని అంశాలపై స్వయంగా(సుమోటో) ఎంచుకుని పరిశీలిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అందులో బ్యాంకింగ్, బీమా రంగ సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల సమీక్ష, ప్రజా మౌలిక వసతులపై వసూలు చేసే రుసుములు, టారి్‌ఫలు, చార్జీల వంటివి ముఖ్యమైనవని ఆయన వివరించారు.