Share News

‘జస్టిస్‌ సుందర్‌’ జీవితం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:23 AM

న్యాయరంగంలో జూనియర్లకే కాకుండా ఎంతో మంది సీనియర్లకు కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుందర్‌ జీవితం స్పూర్తిదాయకమని తెలంగాణ లోకాయుక్త జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

‘జస్టిస్‌ సుందర్‌’ జీవితం స్ఫూర్తిదాయకం

  • తెలంగాణ లోకాయుక్త జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి

  • ఆయన న్యాయరంగ జీవితం ఆదర్శం: వీవీ లక్ష్మీనారాయణ

మన్సూరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): న్యాయరంగంలో జూనియర్లకే కాకుండా ఎంతో మంది సీనియర్లకు కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుందర్‌ జీవితం స్పూర్తిదాయకమని తెలంగాణ లోకాయుక్త జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. జస్ట్టిస్‌ కె.సుందర్‌ న్యాయరంగ ప్రయాణంపై హైకోర్టు న్యాయవాది జి.అనిల్‌ కిరణ్‌కుమార్‌ రచించిన ‘ఏ రెవెర్డ్‌ ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ యాన్‌ అన్‌స్పోకెన్‌ లాస్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ కొత్తపేటలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. న్యాయరంగం ఎంతో సాహసంతో, సున్నితత్వంతో కూడుకున్నదని, ఎంతటి ప్రతికూల కేసులు వచ్చినా ప్రశాంతతతో ఉంటేనే తడబాటు లేకుండా వాదించగలమని జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి చెప్పారు.


జస్ట్టిస్‌ ఎ.సుందర్‌ ఎప్పుడూ ప్రశాంతతతో న్యాయం వైపు ఉంటూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. ఇక 2010 నుంచీ జస్టిస్‌ సుందర్‌తో తనకు పరిచయం ఉందని, ఆయన న్యాయ రంగ జీవితం ఆదర్శనీయమని వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ పుస్తకావిష్కరణలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ జస్టిస్‌ కె.సుందర్‌ బదిలీకావడం తెలంగాణకు లోటు అని, మద్రాసు వారికి అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం జస్ట్టిస్‌ కె.సుందర్‌, శాంతి దంపతులను అతిథులు శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.జగన్‌, వివిధ జిల్లా కోర్టుల జడ్జీలు, న్యాయవాదులుపాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 04:23 AM