Share News

Telangana Minister: లిక్కర్‌ దందా.. కల్వకుంట్ల పేటెంట్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:19 AM

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Telangana Minister: లిక్కర్‌ దందా.. కల్వకుంట్ల పేటెంట్‌

  • కేటీఆర్‌ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా?

  • మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్లి లిక్కర్‌ స్కాంలో ఇరుక్కోలేదా?

  • మీరు బీజేపీ కాళ్లపై పడలేదా?

  • నేను లేఖ రాస్తేనే రిజ్వీ వీఆర్‌ఎస్‌ తీసుకున్నాడా?

  • ఆయనకు ఏఐజీలో 10 లక్షల వేతన ఆఫర్‌ వచ్చింది

  • నిజాయితీ అధికారి అయితే నా లేఖలపై స్పందించలేదెందుకు?

  • మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్‌

  • క్యాబినెట్‌ భేటీకి రిజ్వీ

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్‌ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబ పేటెంట్‌ హక్కు అని, వారిదే బ్రాండ్‌ అని ఆరోపించారు. సీఎ్‌సకు తాను రాసిన లేఖ వల్లే ఐఏఎస్‌ అధికారి రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకున్నారన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. నిజానికి తాను వీఆర్‌ఎ్‌సను ఆమోదించొద్దని చెప్పానని తెలిపారు. మద్యం సీసాలపై హోలోగ్రామ్‌ వేసే టెండర్లపై తాను రాసిన లేఖలకు స్పందించకపోవడంతో రిజ్వీపై సీఎ్‌సకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గురువారం మంత్రివర్గ సమావేశం అనంతరం సహచర మంతుల్రు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ బాటిళ్లపై ఉండే హోలోగ్రామ్‌ కాంట్రాక్టును 2013 ఆగస్టు 21న ఒక కంపెనీకి ఇచ్చారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే కంపెనీతో 2014 జూలై 1న ఒప్పందం చేసుకుని, 2019 వరకు కొనసాగించింది. 2019లో ఆ కంపెనీ ఒప్పందం గడువు ముగిసింది. అయినా 2019 నుంచి 2023 వరకు ఎలాంటి టెండర్లు పిలవకుండా నామినేషన్‌ పద్ధతిన అదే కంపెనీకి ప్రతి ఏటా పొడిగిస్తూ వచ్చారు. నేను మంత్రినయ్యాక రెండు నెలలకే అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీంతో.. ఏటా రూ.40 కోట్లకు ఇవ్వాల్సిన కాంట్రాక్టును ఐదేళ్లపాటు నామినేషన్‌ పద్ధతిన ఎలా కొనసాగించారని, టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించాను. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పాను’’ అని మంత్రి జూపల్లి వివరించారు.


లిఖితపూర్వకంగా లేఖ రాసినా స్పందనలేదు..

అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో 2024 ఆగస్టు 13న లిఖిత పూర్వకంగా లేఖ పంపానని మంత్రి తెలిపారు. మళ్లీ అదే ఏడాది సెప్టెంబరు 27న, అక్టోబరు 17న రిమైండర్‌తోపాటు లేఖ పంపించానన్నారు. తిరిగి డిసెంబరు 9న మరోసారి లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో ఉన్న గొప్ప టెక్నాలజీని గుర్తించి, ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రె్‌స్ట(ఈఏఐ)ను ఆహ్వానించి, దాని ప్రకారం టెండర్లు పిలవాలని చెప్పాం. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, చైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి రిజ్వీని వేశాం. అయినా.. కమిటీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని పెట్టలేదు. మంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్లు స్పందించలేదు. చివరికి స్పందించి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రె్‌స్టను ఆహ్వానించారు. దీనికి 23 దరఖాస్తులు వచ్చాయి. ఇవి వచ్చి నాలుగైదు నెలలు దాటిపోయింది. దీనిపై ఇప్పటివరకు ప్రజెంటేషన్‌ ఇవ్వలేదు. మంత్రి అంటే ప్రభుత్వం. చట్టం, రూల్స్‌ ప్రకారం ఆదేశాలు జారీ చేసినా... స్పందించకపోవడంతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించి, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగాం. కమిటీకి కూడా ఆయనే(రిజ్వీ) చైర్మన్‌. ఆయన నిజాయితీ అధికారి అని కేటీఆర్‌ అంటున్నారు. మరి ఆ నిజాయితీ అధికారినే చైర్మన్‌గా నియమించాం కదా? ఆదేశాలిచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేదు. దాంతో నేను అక్టోబరు 11న సీఎ్‌సకు లేఖ పంపించాను. విధులు నిర్వర్తించకపోవడం, నిర్లక్ష్యం చేయడం, ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కలిగించారంటూ సీఎ్‌సకు వివరించాను’’ అని జూపల్లి వెల్లడించారు.

సీఎ్‌సకు అందుకే ఫిర్యాదు చేశాను..

డిస్టిలరీల ఏర్పాటు గురించి అధికారులు మంత్రికి రూల్స్‌ వివరించాలని మంత్రి అన్నారు. డిస్టిలరీ వల్ల ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. అయితే, ‘‘గత ప్రభుత్వంలో కేసీఆర్‌ క్యాబినెట్‌కు పంపారు.. మీరు కూడా క్యాబినెట్‌కు పంపండంటూ ఆ అధికారి(రిజ్వీ) నాకు చెప్పాడు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌ ఏం పంపారో ఆ ఫైళ్లను పంపించాలని అడిగాను. కానీ, అది కూడా పంపలేదు. దీని గురించి సీఎ్‌సకు వివరించాను. డిస్టిలరీల లీజు లైసెన్స్‌ గడువు ముగియగానే మళ్లీ పొడిగించాలి. అలా చేయని కారణంగా ఒక కంపెనీ వల్ల నెలకు రూ.23 కోట్లు, 10 నెలలకు రూ.230 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. చట్టంలో లేనివి చేశారు.. ఉన్నవి చేయలేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నందున.. సీఎ్‌సకు ఫిర్యాదు చేశాను. నేను లేఖ పంపినందుకే వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని అంటున్నారు. అది వాస్తవం కాదు. ఆయనకు ఏఐజీలో నెలకు రూ.10 లక్షల వేతనం ఆఫర్‌ వచ్చింది. ఢిల్లీలో కూడా కొన్ని కంపెనీలు ఎక్కువ వేతనాలిస్తాయి. దాని కోసమే వీఆర్‌ఎస్‌ పెట్టుకున్నారు. ఆ విషయం నాకు తెలియదు. ఇది వాస్తవం’’ అని జూపల్లి అన్నారు.


  • ప్రభుత్వానికి మేలు జరగాలనుకోవడం తప్పా?

ప్రభుత్వానికి జరగాల్సిన మేలు చేయనప్పుడు ప్రశ్నించడం తప్పవుతుందా? అని మంత్రి జూపల్లి నిలదీశారు. సొంత ఉద్యోగం కోసం వీఆర్‌ఎస్‌ తీసుకుంటే దానికి, దీనికి ముడిపెట్టి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ‘‘ఏడాదికి రూ.40 కోట్ల హోలోగ్రామ్‌ కాంట్రాక్టుకు టెండరు పిలవలేదు. దీనిని రాజకీయం చేసి, ముఖ్యమంత్రి అల్లుడిపై రూ.500 కోట్ల ఆరోపణలు చేశారు. నా కొడుకు కూడా కాంట్రాక్టు కోసం ప్రయత్నించాడని అంటున్నారు. కేటీఆర్‌కు మతిస్థిమితం ఉందా? అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? నా చరిత్ర కేటీఆర్‌కు తెలియదా? ఉమ్మడి రాష్ట్రంలో మూడున్నరేళ్ల మంత్రి పదవిని వదిలిపెట్టాను. పదవులు, డబ్బు కోసం ఆశ పడలేదు. ఆనాడు నేను ఎన్నికల్లో ఓడిపోతే ఇదే కేటీఆర్‌ ‘మీరు ఓడిపోవడం బాధగా ఉంది, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ పదవి మీకు బాగుంటుంది. ఒకసారి కేసీఆర్‌ను అడగండి’ అని నాతో అన్నాడు. లిక్కర్‌ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెండ్‌ రైట్‌, వాళ్లదే బ్రాండ్‌. మీ సొంత చెల్లెలు ఢిల్లీకి వెళ్లి లిక్కర్‌ స్కాంలో ఇరుక్కోలేదా? రూ.కోట్ల దోపిడీ జరగలేదా? బీఆర్‌ఎ్‌సను తాకట్టు పెట్టి, బీజేపీ కాళ్ల మీద మోకరిల్లలేదా?’’ అని వ్యాఖ్యానించారు.

  • రూ.వేల కోట్లకు పడగలెత్తారు..

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, కవిత, సంతోష్‌ అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఒకప్పుడు లక్ష రూపాయలకు కారు అమ్ముకున్నారని, ఈరోజు ఒక్కొక్కరు రూ.వేల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. ‘‘మీరు నన్ను, మా ముఖ్యమంత్రిని వేలెత్తి చూపుతారా? రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో నేను మంత్రిగా ఉన్నా. ఏ ఒక్కరోజైనా నాపై ఆరోపణలు వచ్చాయా? మీ రాజకీయ పబ్బం కోసం అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులను మీరే ఎదుర్కొంటున్నారు. అమరుల త్యాగాలపై వచ్చిన రాష్ట్రాన్ని దోచుకోలేదా? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయలేదా? జూబ్లీహిల్స్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం బట్టకాల్చి మీదేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా.. మీకు పుట్టగతులు ఉండవు. ప్రతి దానినీ తప్పు పడుతున్నారు. నేను లేఖ రాస్తేనే రిజ్వీ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని అంటున్నారు. దీనిపై పరువు నష్టం దావా వేస్తాను. ఇంత దిగజారుడుతనమా? మానవత్వం, విలువలు ఉండాలి. మీ చేత చెప్పించుకునే ఖర్మ మాకు పట్టలేదు’’ జూపల్లి ధ్వజమెత్తారు. రిజ్వీ వీఆర్‌ఎస్‌ ఆమోదించవద్దని తానే చెప్పానని మరోసారి స్పష్టం చేశారు.


  • క్యాబినెట్‌ భేటీకి రిజ్వీ

  • వీఆర్‌ఎస్‌ తీసుకొని కూడా హాజరు..

  • ఐఏఎస్‌ అధికారి తీరుపై సర్వత్రా చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎ్‌స)కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా చర్చనీయాంశంగా మారిన ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఏఎం రిజ్వీ గురువారం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. వీఆర్‌ఎస్‌ దరఖాస్తు ఆమోదం పొందాక కూడా ఆయన అధికారిక హోదాలో క్యాబినెట్‌ భేటీకి హాజరవ్వడంపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే ఎక్సైజ్‌ శాఖకు ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలన శాఖ ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న రిజ్వీ వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకోవడం, ఆయన నిర్ణయం రాజకీయంగా దుమారం రేపడంతో అధికార, ప్రతిపక్షాల మధ్యన మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ వ్యవహారం కారణంగానే రిజ్వీ రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆయన తన వ్యక్తిగత కారణాలతోనే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టతనిచ్చారు. రిజ్వీకి ఏఐజీలో ఎక్కువ జీతంతో ఆఫర్‌ రావడంతోనే రాజీనామా చేశారని చెప్పారు. అయితే ఏఐజీ అంటే ఆస్పత్రి కాదని, అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌కు సంబంఽధించిన ఓ పెద్ద కంపెనీ అనే చర్చ జరుగుతోంది.

Updated Date - Oct 24 , 2025 | 04:19 AM