Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బరిలో 81 మంది
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:59 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల లెక్క తేలింది.
130 మంది నామినేషన్ల తిరస్కరణ ముగిసిన పరిశీలన
17 గంటలపాటు స్ర్కూటినీ ఉపసంహరణకు నేడు ఆఖరి రోజు
స్వతంత్రులను విత్‌డ్రా చేయించేందుకు నేతల యత్నాలు
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల లెక్క తేలింది. సుదీర్ఘ పరిశీలన అనంతరం 81 మంది నామినేషన్లను రిటర్నింగ్ అధికారి సాయిరాం ఆమోదించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మొదలైన స్ర్కూటినీ గురువారం తెల్లవారుజాము వరకు సుమారు 17 గంటలపాటు సాగింది. మొత్తం 211 మంది 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 130 మంది నామినేషన్లను పలు కారణాలతో తిరస్కరించారు. ఎక్కువగా స్వతంత్రులు, ఎన్నికల సంఘం గుర్తింపులేని పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సరైన పత్రాలు సమర్పించకపోవడం, ఫారం పూర్తిగా నింపకపోవడం, ఇతర నియోజకవర్గాలకు చెందిన వారిని బలపరచాల్సిన పది మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారు కాకపోవడం వంటి కారణాలతో నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం ఆఖరు తేదీ. దీంతో బరిలో ఉండేది ఎందరు? తప్పుకొనేది ఎవరన్నది శుక్రవారమే తేలనుంది. ఇదిలా ఉండగా.. తమ నామినేషన్ల తిరస్కరణకు కారణాలు చెప్పాలంటూ కొందరు అభ్యర్థులు గురువారం షేక్‌పేటలోని రిటర్నింగ్ కార్యాలయం వద్దకు వచ్చారు. తిరస్కరణకు కారణాలను లిఖిత పూర్వంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని ఎన్నికల అఽధికారులు తెలపడంతో ఆందోళనకు దిగారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు వారించారు.
విత్‌డ్రా చేయించే ప్రయత్నాలు షురూ..
ప్రధాన పార్టీల అభ్యర్థులు అనేక కాలమ్‌లు వదిలేసినా వారి నామినేషన్లను ఆమోదించారని, కానీ, తాము కేవలం ఒక్క కాలమ్ నింపనందుకే తమ నామినేషన్లను తిరస్కరించారని మాల మహానాడు జేఏసీ నాయకులు ఆరోపించారు. కాగా, తన నామినేషన్‌లో ఎలాంటి తప్పులు లేకపోయినా తిరస్కరించారని, దీనిపై కోర్టుకు వెళతానని ఓ స్వతంత్ర అభ్యర్థి తెలిపారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇబ్బందికరంగా ఉన్న స్వతంత్రులను విత్‌డ్రా చేయించేందుకు ఆయా పార్టీల సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. వెయ్యి, అంతకుమించి ఓట్ల ప్రభావం చూపించే వారిని ఉపసంహరింపజేసేలా చర్చలు మొదలు పెట్టారు.