Komatireddy Venkatareddy: కేసీఆర్, కేటీఆర్ కన్నా జగదీశ్ రెడ్డే ఎక్కువ సంపాదించారు
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:58 AM
ఔటర్ రింగ్‌రోడ్డుకు దగ్గర్లో షాబాద్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి 80ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు...
కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర ఎకరా రూ.50 లక్షలు
జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్ వద్ద ఎకరా రూ.40 కోట్లు
ఓఆర్‌ఆర్ పక్కన షాబాద్‌లో జగదీశ్‌కు 80ఎకరాల క్షేత్రం
ఎస్‌ఎల్‌బీసీ కూలడానికి కేసీఆర్ క్షుద్రపూజలు?
మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్‌రోడ్డుకు దగ్గర్లో షాబాద్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి 80ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇక్కడ ఎకరం ధర రూ.40కోట్ల నుంచి రూ.50కోట్లు ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్ కంటే జగదీశ్ రెడ్డే ఎక్కువ ఆస్తులు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఆయన గురువును మించిన శిష్యుడన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర ఎకరం రూ.50లక్షలు ఉంటే, జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్ దగ్గర రూ.40కోట్లు అని వివరించారు. సోమవారం వెంకటరెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్ల దగ్గర రూ.60వేల కోట్లు ఉన్నాయని, ఏ అధికారి దగ్గర సోదాలు చేసినా వందల, వేల కోట్ల రూపాయలు బయటపడుతున్నాయని చెప్పారు. అధికారుల దగ్గరే ఇంత డబ్బుంటే లీడర్ల దగ్గర ఇంకెంత ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎడమ కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్‌పై కేసీఆర్ క్షుద్రపూజలు చేసినట్టున్నారని, అందుకే అది కూలిపోయిందని వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ తెలంగాణను బిచ్చగాళ్ల రాష్ట్రంగా మార్చారని, బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని ఆయన తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపుల్లేవు
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు కాంగ్రె్‌సదేనని వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విలన్లది కొద్ది రోజులే నడుస్తదని, సీఎం రేవంత్, తమ పార్టీ నేతలు ఎవర్‌గ్రీన్ హీరోలని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ఏ విషయంలోనూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీలో మాదిరి అరెస్టులు ఉంటాయని అనుకోవద్దని, ఏపీ, తెలంగాణ రాజకీయాలు వేర్వేరని అన్నారు. సినిమాల్లో విలన్లను క్లైమాక్స్‌లోనే అరెస్టు చేస్తారంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ముందున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి తరహాలాంటిదానిని నల్గొండలోనూ నిర్మిస్తున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు భూసేకరణకు రూ.6వేల కోట్లు ఖర్చవుతుందని, ఇప్పటివరకు 96ు భూసేకరణ పూర్తయిందని ఆయన వెల్లడించారు.