Employee Issues: సామరస్యం ముగిసింది..ఇక సమరమే
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:03 AM
ప్రభుత్వంతో సామరస్యం ముగిసిందని, డిమాండ్ల సాధనకు ఇక సమరమే మిగిలిందని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి(జేఏసీ) పేర్కొంది.
కమిటీల పేరుతో సర్కారు కాలయాపన
ఇకపై ఎవరితోనూ మాట్లాడేది లేదు
అక్టోబరు 12న చలో హైదరాబాద్:ఉద్యోగుల జేఏసీ
హైదరాబాద్, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంతో సామరస్యం ముగిసిందని, డిమాండ్ల సాధనకు ఇక సమరమే మిగిలిందని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి(జేఏసీ) పేర్కొంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నోటితో పలకరించి.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో జేఏసీ కార్యనిర్వాహక కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కమిటీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
అందుకే సెప్టెంబరు 8వ తేదీ నుంచి రాష్ట్ర మంతా బస్సు యాత్ర చేపట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగులను కదలిస్తామని చెప్పారు. అక్టోబరు 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం 20 నెలలుగా వేచి ఉన్నా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం ఇక ఎవరికి భయపడేది లేదని, ఎవరితోనూ మాట్లాడేది లేదని జేఏసీ ఛైర్మన్ పేర్కొన్నారు. లక్ష మందితో అక్టోబరు 12న సభను విజయవంతం చేస్తామని పింఛనుదారుల సంఘం చైర్మన్ కె.లక్ష్మయ్య తెలిపారు. తమ పైసలు తమకియ్యనప్పుడు జీపీఎఫ్, టీజీఎల్‌ఐ నెలవారీ జమ ప్రభుత్వ ఖాతాలో ఎందుకు జమ చేయాలని జేఏసీ కో చైర్మన్ అంజిరెడ్డి ప్రశ్నించారు.