మఠంపల్లిలో ఇనుప యుగపు ఆనవాళ్లు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:19 AM
: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని ఇనుప యుగపు ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు గుర్తించారు.

క్రీ.పూ 1000 ఏళ్ల నాటి నిలువు రాయి
కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
మఠంపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని ఇనుప యుగపు ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, నసీరుద్దీన్, చంటి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం పురావస్తు పరిశోధకుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వాటిని పరిశీలించారు. మఠంపల్లి పాత శివాలయంలో దారిలో ఉన్న 12 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నిలువు రాయిని(స్మారకశిల) ఆయన పరిశీలించారు. ఈ రాయి క్రీ.పూ పూర్వం 1000 ఏళ్లనాటి ఇనుప యుగపు స్థావరమని, ఆ కాలంలో మరణించిన వారిని ఒక గుంటలో పూడ్చి పైన మట్టితో కప్పి గుర్తుగా ఒక స్మారక శిలను నిలిపే ఆచారం ఉండేదని, అందులో భాగంగానే ఈ నిలువు రాయిని ఇక్కడ ఏర్పాటు చేశారని తెలిపారు. పురావస్తు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ నిలువురాయిని కాపాడుకోవాలని మఠంపల్లి గ్రామస్థులకు సూచించారు. ఆయన వెంట హుజూర్‌నగర్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, న్యాయవాది సాముల రాంరెడ్డి ఉన్నారు.