Share News

Weather Update: వణికిస్తున్న చలి

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:47 AM

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్‌...

Weather Update: వణికిస్తున్న చలి

  • రాష్ట్రంలో మరింత పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

  • ఆదివారం అత్యల్పంగా సిర్పూర్‌లో 7.4 డిగ్రీలు

  • 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్‌

  • శేరిలింగంపల్లిలో 10 డిగ్రీలకు పడి పోయిన ఉష్ణోగ్రతలు

  • రాబోయే రెండుమూడు రోజులు మరింత చలి

  • వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/ఆసిఫాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 7 - 11 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే మూడు రోజులకుగాను 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, మెదక్‌, నిర్మల్‌, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్‌, ములుగు జిల్లాల్లో 6-10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీ సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్ర నమోదైంది. శివారు ప్రాంతాలు, వృక్షాలు అధికంగా ఉన్న చోట ఉదయం పూట పొగమంచు దట్టంగా అలముకుంటోంది.

Updated Date - Nov 17 , 2025 | 05:48 AM