Share News

Pongulati Srinivasareddy: చెంచులకు సర్కారు తీపి కబురు

ABN , Publish Date - May 14 , 2025 | 06:22 AM

ఆదిమ గిరిజన తెగల్లోని అతి బలహీన వర్గం చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 వేల ఇందిరమ్మ ఇళ్లను అందించనుంది. గిరిజన ప్రాంతాలలో ఈ ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

Pongulati Srinivasareddy: చెంచులకు సర్కారు తీపి కబురు

రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆదిమ గిరిజన తెగల్లో అతి బలహీన వర్గం చెంచులు. సంచార జీవనం సాగిస్తూ తరతరాలుగా సొంతింటికి నోచుకోని చెంచులకు సీఎం రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తీపి కబురందించనున్నది. రాష్ట్రంలోని పదివేల మంది చెంచులకు తమ ప్రభుత్వం సొంతింటి కల సాకారం చేయనున్నదని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 సమగ్ర గిరిజనాభివృద్థి సంస్థల(ఐటీడీఏ) పరిధిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి 10 వేల చెంచు కుటుంబాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరును మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు మేరకు గిరిజన ప్రాంతాల్లోని చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. అడవుల్లో చిన్నచిన్న గుడిసెలు తప్ప చెంచులకు పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకందని విషయమన్నారు. అటవీ ప్రాంతాల్ని వదలి వారు బతక లేరని అందుకే వారు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే.. ఐటీడీఏ పరిధిలోని గిరిజన అసెంబ్లీ సెగ్మెంట్లకు అదనంగా 500-700 ఇళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందన్న మంత్రి పొంగులేటి.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 20 శాతం ఇళ్లు బఫర్‌ కింద చేపట్టామన్నారు. పట్టణాలు, ప్రత్యేకించి జీహెచ్‌ఎంసీ పరిదిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

Updated Date - May 14 , 2025 | 06:23 AM