Share News

Indias First Automated Parking: నాంపల్లిలో ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:53 AM

దేశంలోనే తొలి అత్యాధునిక ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధమవుతోంది.

Indias First Automated Parking: నాంపల్లిలో ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌

  • దేశంలోనే తొలి ప్రాజెక్టు.. ప్రారంభానికి సిద్ధం

  • పీపీపీ విధానంలో రూ.102 కోట్లతో నిర్మాణం

  • 2 వేల గజాల్లో భవనం.. 10 అంతస్తుల్లో పార్కింగ్‌

  • 250 కార్లు.. 200 ద్విచక్రవాహనాల్ని పెట్టుకోవచ్చు

  • భవనాన్ని పరిశీలించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలి అత్యాధునిక ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో.. రూ.102 కోట్ల వ్యయంతో ‘నోవమ్‌’ సంస్థ నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనంలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 10 అంతస్తుల్లో పార్కింగ్‌తో పాటు సినిమా థియేటర్లు ఉంటాయి. ప్రపంచంలోనే అరుదుగా ఉండే పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ బహుళ అంతస్తుల పార్కింగ్‌ వ్యవస్థను నాంపల్లిలో నిర్మించామని మెట్రో ఎండీ ఎన్వీఎ్‌సరెడ్డి ఆదివారం వెల్లడించారు. నాంపల్లిలో నిర్మించిన ఈ భవనాన్ని ఆయన పరిశీలించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తుది అనుమతులు లభించాల్సి ఉందని, అవి రాగానే ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జర్మనీకి చెందిన అత్యాధునిక ‘పాలిస్‌’ సాంకేతికతతో పూర్తి ఆటోమేటెడ్‌ పజిల్‌ పార్కింగ్‌ సిస్టమ్‌గా దీన్ని నిర్మించారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రపంచంలోనే అత్యాధునిక పార్కింగ్‌ కాంప్లెక్సుల్లో ఒకటని, భారతదేశంలో ఇదే మొదటిదని వెల్లడించారు. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ 2 వేల గజాల స్థలాన్ని 50 ఏళ్లకు రాయితీపై ఇవ్వగా, ప్రాజెక్టు డెవలపర్లు హరికిషన్‌రెడ్డి, భావనారెడ్డి రూ.102 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు.


15లో 10 అంతస్తులు పార్కింగ్‌కే..

నాంపల్లి కూడలిలో నిర్మిస్తున్న ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులు ఉంటాయని, అందులో 10 అంతస్తులు వాహనాల పార్కింగ్‌ కోసమే కేటాయిస్తున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. ఇందులో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకోవచ్చన్నారు. 3 బేస్‌మెంట్లు, 7 పై అంతస్తులు పార్కింగ్‌ కోసం, మిగతా అంతస్తులను వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా నిర్మించారని తెలిపారు. 2 మల్టీప్లెక్స్‌ సినిమా థియేటర్లు, 11వ అంతస్తులో నగర వీక్షణకు ఒక గ్యాలరీ ఉంటుందని రెడ్డి వివరించారు. సెన్సార్ల సహాయంతో మానవ ప్రమేయం లేకుండా జరిగే ఈ ఆటోమేటెడ్‌ పజిల్‌ పార్కింగ్‌ విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. వాహనాలు లోపలికి, బయటకు వచ్చే టెర్మినళ్లు విశాలంగా ఉండి, స్మార్ట్‌గా పని చేస్తాయని తెలిపారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు అనుకూలంగా ఉండేలా ఫ్లాట్‌ టెర్మిన ళ్లు ఉంటాయని చెప్పారు. వాహనం ఏ దిశలో ఉన్నా.. 360 డిగ్రీలు తిరిగగలిగే ప్యాలిస్‌ టేబుల్‌ స్వయంగా దాన్ని సరైన విధానంలో పెట్టి పార్కింగ్‌ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ పార్కింగ్‌ ప్రక్రియ వినియోగదారులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ‘‘ప్రవేశద్వారంలో క్యూఆర్‌ కోడ్‌ ఉన్న టికెట్‌ (స్మార్ట్‌ కార్డ్‌) సూచనలతో ఇన్‌/అవుట్‌ టెర్మినల్‌కు చేరుకున్న వెంటనే, కార్డును స్వైప్‌ చేస్తే టెర్మినల్‌ గేట్‌ తెరుచుకుంటుంది. డ్రైవర్‌ టర్న్‌ టేబుల్‌ మీద కారును పెట్టి, హ్యాండ్‌ బ్రేక్‌ వేసి, ఇంజిన్‌ ఆఫ్‌ చేసి బయటకు వస్తే సరిపోతుంది. టెర్మినల్‌ బయట కార్డును స్వైప్‌ చేయగానే పార్కింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సిస్టమ్‌ తనంతట తానే కారును స్కాన్‌ చేసి ఎస్‌యూవీ, సెడాన్‌లుగా వర్గీకరించి, వాటికి కేటాయించిన అంతస్తులో పార్క్‌ చేస్తుంది. వినియోగదారుడు ఫీజు చెల్లించిన తర్వాత, సూచించిన టెర్మినల్‌ వద్దకు వెళ్లి కార్డును స్వైప్‌ చేయగానే, పార్కింగ్‌ ప్లాట్‌ఫాం నుంచి వాహనం వినియోగదారుడి వద్దకు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచ స్థాయి పార్కింగ్‌ అనుభవాన్ని అందించనున్నాం’’ అని రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 03:53 AM