Share News

Increased Surveillance on Maoist: మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

ABN , Publish Date - Oct 23 , 2025 | 06:26 AM

మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఓవైపు భద్రతా బలగాలు ముందుకు సాగుతుండగా.. మరోవైపు మావోయిస్టు దళాలకు, నాయకత్వాని...

Increased Surveillance on Maoist: మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

  • సోషల్‌ మీడియా పోస్టులపై కేంద్ర బృందాలు, రాష్ట్ర పోలీసుల నిఘా

  • నక్సల్స్‌ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత స్పందించిన వారిపై కన్ను

  • పోలీసుల రాడార్‌లో కొన్ని ఎన్‌జీవో సంస్థలు

  • మావోయిస్టు అనుబంధ ప్రజాసంఘాల్లో పని చేస్తున్న వారిపైనా ఆరా

  • సికాసలో కదలిక.. పోలీస్‌ల అప్రమత్తతతో వెనక్కి

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఓవైపు భద్రతా బలగాలు ముందుకు సాగుతుండగా.. మరోవైపు మావోయిస్టు దళాలకు, నాయకత్వానికి పట్టణ ప్రాంతాల నుంచి ఆర్థిక , సైద్ధాంతిక మద్దతునిస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృషి ్టసారించాయి. ఇటీవల మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌.. పార్టీ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఆయుధాలతో లొంగిపోయిన సందర్భంలో, అంతకుముందు ఆయన చేసిన ప్రకటనలపై స్పందించిన వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా పోస్టులనూ నిఘా వర్గాలు జల్లెడ పడుతున్నాయి. మల్లోజులతోపాటు ఆశన్న తదితరులు లొంగిపోవడం, పార్టీని పునర్‌నిర్మిస్తామన్న మావోయిస్టుల తాజా ప్రకటనల నేపథ్యంలో ఆయా అంశాలపై స్పందిస్తున్న వారెవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. వారి కుటుంబ, ఉద్యోగ వివరాలు, ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో పోస్టులు తాత్కాలిక ఆవేశానికి గురై పెట్టారా? లేక మావోయిస్టు పార్టీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ బహిరంగంగా నైతిక మద్దతు తెలుపుతున్నారా? అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మావోయిస్టులకు ఆర్థిక అండదండలు అందిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి దాదాపు రూ.20 కోట్ల లావాదేవీలను గుర్తించింది. ఈ క్రమంలో కొన్ని ఎన్‌జీవో సంస్థలకు అందుతున్న విదేశీ నిధులు.. మావోయిస్టు కార్యకలాపాల కోసం దారి మళ్లుతున్నాయనే అనుమానంతో నిఘా బృందాలు ఆయా సంస్థల జాతకాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


వారంతా ఇప్పుడేం చేస్తున్నారు?

మావోయిస్టు పార్టీపై దేశవ్యాప్త నిషేధం అమలవుతున్న క్రమంలో దానికి అనుబంధంగా బహిరంగంగా పనిచేస్తున్న పలు ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల పైనా కేంద్ర, రాష్ట్రాలు నిషేధం విధించి అమలు చేస్తున్నాయి. ఆయా ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లలో గతంలో యాక్టివ్‌గా ఉన్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి రహస్యంగా ఏమైనా పనిచేస్తున్నారా? అనే విషయాలను నిఘా అధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదే పదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆలోగా మావోయిస్టులకు మద్దతిచ్చే పట్టణ ప్రాంతాల్లోని అర్బన్‌ నకలైట్లను ఏరివేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ మేరకే అన్ని జిల్లా యూనిట్లకు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోకి కొత్తగా రిక్రూట్‌మెంట్లు జరిగే పరిస్థితులు లేని నేపథ్యంలో.. పట్టణ ప్రాంతం నుంచి మావోయిస్టుల్లోకి పంపడానికి యువతను ఎవరైనా సంసిద్ధం చేస్తున్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో గ్రామీణ పేదల సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎ్‌సయూ), విప్లక కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ తదితర ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లను మావోయిస్టు పార్టీతోపాటు నిషేధించారు. 2015 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది వీటిపై నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా నిషేధంలో ఉన్న సికాసలో మళ్లీ కదలికలు కనిపించాయన్న విషయాన్ని ఇటీవల డీజీపీ శివధర్‌రెడ్డి అంగీకరించారు. వారిపై నిఘా కొనసాగుతుందన్నారు. సికాస కార్యకలాపాలను ప్రారంభించడానికి ఒక ప్రయత్నం జరిగిందని, పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో వారి ప్రయత్నాలు ముందుకు సాగలేదని తెలిపారు. ఈ క్రమంలోనే గతంలో ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లలో పనిచేసి ప్రస్తుతం చట్టబద్ధమైన జీవనాన్ని గడుపుతున్న అనేక మంది మరోసారి పోలీసు రాడార్‌లోకి వచ్చినట్లు సమాచారం.

Updated Date - Oct 23 , 2025 | 06:26 AM