Share News

Bhadradri: మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారం

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:46 AM

అభం శుభం తెలియని ఓ గిరిజన బాలిక. తన కుటుంబ సభ్యులను చూడాలనుకుని ఎంతో ఆనందంతో స్వగ్రామానికి బయలుదేరింది. తన అన్నయ్యకు ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పింది.

Bhadradri: మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారం

  • భద్రాచలం ఏజెన్సీలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..

కొత్తగూడెం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అభం శుభం తెలియని ఓ గిరిజన బాలిక. తన కుటుంబ సభ్యులను చూడాలనుకుని ఎంతో ఆనందంతో స్వగ్రామానికి బయలుదేరింది. తన అన్నయ్యకు ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పింది. అలాంటి బాలిక ఉసురు తీశారు కొందరు నీచులు. కన్నూమిన్నూ కానక.. ఆ 17ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని యేటపాక మండలానికి చెందిన ఆదివాసీ బాలికకు రెండేళ్ల క్రితం ఛత్తీ్‌సగడ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. గతంలోనే బాలిక తల్లిదండ్రులు చనిపోగా.. పుట్టింటి వద్ద ఉంటున్న బంధువులను కలిసేందుకు కుంట మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడి నుంచి ప్యాసింజర్‌ ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు సమాచారం.


మార్గమధ్యలో ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం తాగడంతో పాటు బాధితురాలికి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. పాల్వంచ మండలం జగన్నాథపురం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న సదరు బాలికను గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా అనుమానించిన అధికారులు పాల్వంచ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీడీపీవో లక్ష్మీప్రసన్న ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Updated Date - Aug 25 , 2025 | 04:46 AM