Share News

మీ పరిధిలో ఏం జరుగుతుందో తెలియదా?

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:47 AM

పలువురు జిల్లా రిజిస్ట్రార్లు వారి పరిఽధిలోని కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు, లావాదేవీలపై వివరాలు చెప్పలేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్‌ మండిపడ్డారు.

మీ పరిధిలో ఏం జరుగుతుందో తెలియదా?

  • జిల్లా రిజిస్ట్రార్లపై మండిపడిన ఐజీ బుద్ధప్రకాశ్‌

  • వివరాలు చెప్పలేక నీళ్లు నమిలిన కొందరు రిజిస్ట్రార్లు!

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): పలువురు జిల్లా రిజిస్ట్రార్లు వారి పరిధిలోని కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు, లావాదేవీలపై వివరాలు చెప్పలేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్‌ మండిపడ్డారు. ‘మీ పరిధిలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే పని చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. భూముల మార్కెట్‌ విలువ పెంపుపై జిల్లా రిజిస్ట్రార్లు, ఇతర అధికారులతో ఐజీ కొన్ని రోజులుగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కొంతమంది జిల్లా రిజిస్ట్రార్లు కనీస అవగాహన లేకుండానే పనిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓ రిజిస్ట్రార్‌ను ‘మీ జిల్లాలో ఎన్ని మునిసిపాలిటీలున్నాయి? ఎన్ని గ్రామాలు మీ పరిధిలోకి వస్తాయి? ఏ ప్రాంతంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? ఎక్కువగా స్థలాలు రిజిస్ట్రేషన్‌ జరిగే ప్రాంతం ఏమిట’నే వివరాలు అడగ్గా ఆయన తెలుసుకుని చెబుతానని సమాధానం ఇచ్చారు. ‘మీ జిల్లాకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోకుండానే పనిచేస్తున్నారా’ అని ఐజీ ఆ అధికారిని నిలదీశారు. జీహెచ్‌ఎంసీలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని ప్రాంతాల వివరాలు చెప్పాలని అడగ్గా సంబంధిత అధికారి నీళ్లు నమలడంతో ఐజీ నివ్వెరపోయారు. ‘పైరవీలు చేసుకుని ఉద్యోగాలు తెచ్చుకోవడం కాదు.. పనిచేయడం కూడా నేర్చుకోవాల’ని ఐజీ ఉద్యోగులను హెచ్చరించడం రిజిస్ట్రేషన్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది.


మార్కెట్‌ విలువపై నేడు ప్రజెంటేషన్‌

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ పెంపుపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఒక పీపీటీ తయారుచేశారు. ఏయే ప్రాంతాల్లో ఎంత శాతం పెంచాలి, స్టాంప్‌ డ్యూటీ అంశంపై రూపొందించిన ఈ పీపీటీతో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి వివరించనున్నారు. గత 11 సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ల పెరుగుదల, కారణాలను వివరిస్తూ ఒక హ్యాండ్‌బుక్‌ను కూడా అధికారులు తయారుచేశారు. పొరుగు రాష్ట్రాల్లో స్టాంప్‌ డ్యూటీ ఎలా ఉంది, వ్యత్యాసాలను హ్యాండ్‌బుక్‌లో ప్రచురించారు.

Updated Date - Jun 12 , 2025 | 04:47 AM