Share News

Public Transport: ఆర్టీసీ లాభాల్లో ఉంటే తాకట్టు ఎందుకు

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:06 AM

తెలంగాణ ఆర్టీసీ టీజీఎ్‌సఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా భారీగా లాభాలు గడించిందని చెప్పి సంబరాలు చేసుకొని

Public Transport: ఆర్టీసీ లాభాల్లో ఉంటే తాకట్టు ఎందుకు

  • సర్కార్‌ సమాధానం చెప్పాలి: ఎంప్లాయీస్‌ యూనియన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఆర్టీసీ(టీజీఎ్‌సఆర్టీసీ) మహాలక్ష్మి పథకం ద్వారా భారీగా లాభాలు గడించిందని చెప్పి సంబరాలు చేసుకొని వారం రోజులు గడవక ముందే బ్యాంకులకు ఆర్టీసీ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొనే దుస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. గౌలిగూడ బస్‌స్టేషన్‌ను రూ.400 కోట్ల బ్యాంకు రుణం కోసం తాకట్టు పెట్టినట్లు పత్రికల్లో కథ నం రావడంపై ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ విస్మయం వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. బాబు, ఈదురు వెంకన్న స్పందిస్తూ.. ప్రభుత్వం, యాజమాన్యం కలిసి తెలంగాణ సమాజాన్ని, ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. అసలు మహాలక్ష్మి ‘సున్నా’ టికెట్‌ డబ్బులు ప్రతి నెలా ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత ఇస్తున్నది? అన్ని వివరాలతో యాజమాన్యం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రతీ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.6,686 కోట్లు ఆర్టీసీకి ఇచ్చినట్లు గొప్పగా చెప్పుకొంటున్నదని గుర్తుచేస్తూ.. ఆర్థిక శాఖ ద్వారా ఇచ్చిన డబ్బుల లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు ఉన్న అనుమానాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు. 20 నెలల నుంచి ఆర్టీసీలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని వారు ప్రశ్నించారు.

Updated Date - Aug 11 , 2025 | 04:06 AM