పునరావాసం కల్పించకుంటే పనులు సాగనివ్వం
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:21 AM
పునరావాసం, అర్హులైన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుంటే పనులు అడ్డుకుంటామని నిర్వాసితులు స్పష్టం చేశారు.

మర్రిగూడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పునరావాసం, అర్హులైన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుంటే పనులు అడ్డుకుంటామని నిర్వాసితులు స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ చర్లగూడ రిజర్వాయర్ కట్ట పనులను గురువారం అడ్డుకున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నర్సిరెడ్డిగూడెం బాధిత నిర్వాసితులను పునరావాసం కోసం అధికారులు 289మందిని అర్హులుగా గుర్తించారని అందులో 157మందికి మాత్రమే పునరావాసం సంబంధించిన పట్టా ధ్రువపత్రాలను అందజేసి 32మందికి ఇప్పటి వరకు పునరావాసంకు సంబంఽధించిన పట్టా పత్రాలు అందజేయాలని నర్సిరెడ్డిగూడెం ముంపు గ్రామ బాధితులు ము ద్దం వెంకటమ్మ, మనోహర, చంద్రకళ, యాదమ్మ పలువురు ఆరోపించారు. పునరావాసం పూర్తి కాకముందే తమను గ్రామాలను ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్‌ను పూర్తిగా బంద్ చేశారని ఆరోపించారు. పలుసార్లు ఇరిగేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. గురువారం మధ్యాహ్నం 2గంటల నుంచి 3.30గంటల వరకు సుమారు గంటన్నర వరకు పనులు జరగకుండా వాహనాలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎవరికీ అన్యాయం జరగదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని బాధితులకు నచ్చజెప్పారు. హామీ ఇచ్చే వరకూ వెళ్లేదిలేదని బాధితులు బైఠాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నెలరోజుల్లో పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో పను లు కొనసాగించారు. ఈ విషయంపై ఈఈ రాములునాయక్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గ్రామాలు ఖాళీ చేయాలని ఎవరితోనూ చెప్పలేదని, విద్యుత్, నెట్‌వర్స్ సిగ్నల్స్ నిలిపి వేయలేదన్నారు. పనులుచేసే వద్ద టిప్పర్ వాహనం ఢీకొనడంతో రెండు రోజులు విద్యుత్ నిలిచిపోయిందని గ్రామానికి తిరిగి విద్యుత్ సరఫరా అవుతుందన్నారు.