681ఎకరాల గుర్తింపు
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:55 PM
రైతుబంధుకు కాదేదీ అనర్హం అన్న చందంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గు ట్టలు... పరిశ్రమలు.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున ప్రజాధనాన్ని పప్పుబెల్లంలా పంచారు.

681ఎకరాల గుర్తింపు
మండలంలో సాగుకు యోగ్యత లేని భూమి
వీటన్నింటికీ గత సర్కారులో రైతుబంధు
జాబితాలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ గుట్ట
నార్కట్‌పల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రైతుబంధుకు కాదేదీ అనర్హం అన్న చందంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గు ట్టలు... పరిశ్రమలు.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున ప్రజాధనాన్ని పప్పుబెల్లంలా పంచారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉంటే చాలన్న తీరుగా సాగుకు అవకాశమే లేని భూములనూ చేర్చి రైతుబంధు కట్టబెట్టారు. సాగుకు యోగ్యత లేని భూముల గుర్తింపు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు నార్కట్‌పల్లి మండలంలో 681 ఎకరాలను గుర్తించా రు. మండలంలోని 5 క్లస్టర్ల పరిధిలోని 19 రెవెన్యూ గ్రామ పంచాయతీలలోని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్ర స్థా యిలో పర్యటించి సాగుకు యోగ్యత లేని, భవిష్యత్తులో అసలు సాగుకు అవకాశమే లేని భూములను గ్రామాల వారీగా గుర్తించి ఓ జాబితా తయారు చేశారు.
జాబితాలో గుట్ట...సోలార్ ప్లాంట్.. ప్లాట్లు
వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన సర్వేతో గుర్తించి న వాటిలో సుమారు 100 విస్తీర్ణంలో ఉన్న ఓ గుట్ట 18 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటైన భూములు, మిగతా వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన ప్లాట్లూ ఉండటం విస్తుపోయే విషయం. నాలా (నాన అగ్రికల్చరల్) కు మార్చకుండా వ్య వసాయ భూముల్లోనే చేసిన వెంచరులోని వందల సంఖ్యలో ప్లా ట్లూ ఉన్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు నాలాకు వెళితే ప్రభుత్వానికి పన్ను చెల్లించా ల్సి వస్తుందనే దురాశతో నాలాగా మార్చుకోకుండానే వెంచర్లు చే సి గజాల చొప్పున రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాట్లను విక్రయించారు. దీంతో వ్యవసాయ భూములుగానే ఉన్న వీటన్నింటికీ ఇంతకాలం రైతుబంధు వర్తించింది.
గ్రామాల వారీగా ఎకరాలు
గ్రామాల వారీగా వ్యవసాయ అధికారులు గుర్తించిన సాగుకు యోగ్యత లేని భూముల వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ లింగోటంలో 39.30 ఎకరాలు, చౌడంపల్లిలో 12.09 ఎకరాలు, మాండ్రలో 205.38, నార్కట్‌పల్లిలో 10.23, అక్కెనపల్లిలో 21.08, అమ్మనబోలులో 40.24, అవురవాణిలో 4.12, బీ.వెల్లెంలలో 0.12, చెర్వుగట్టులో 126.03, ఎల్లారెడ్డిగూడెంలో 51.17, పోతినేనిపల్లిలో 28.11, శాపల్లిలో 33.35 ఎకరాలు, తొండ్లాయిలో 1.10 ఎకరాలను సాగుకు యోగ్యత లేనివిగా వ్యవసాయధికారులు గుర్తించారు. అత్యధికంగా మాండ్రలో 205.38 ఎకరాలను గుర్తించగా ఇక్కడ ఓ (పట్టాభూమి) గుట్టకు రైతుబంధు వర్తించింది. ఆ తదుపరి చెర్వుగట్టులో 126.03 ఎకరాలు కాగా వీటిలో 110ఎకరాల వరకు వెంచరు భూములే ఉన్నాయి. అత్యల్పంగా బ్రాహ్మణవెల్లెంలలో కేవలం 0.12 గుంటలు మాత్రమే సాగుకు యోగ్యత లేనివిగా గుర్తించి రైతుబంధు తొలగింపు జాబితాలో చేర్చారు. అయితే మిగతా కొన్ని రెవెన్యూ గ్రామాలైన చిప్పలపల్లి, నక్కలపల్లి, సబ్బిడిగూడెం, నెమ్మానిలలో మాత్రం సాగు (రైతుబంధు)కు యోగ్యత లేని భూములు లేనట్లుగా నివేదిక తయారు చేశారు.
పారదర్శకంగా సర్వే చేసి తొలగించాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో సాగుకు యోగ్యత లేని భూ ముల గుర్తింపు సర్వేను పూర్తి పారదర్శకతతో చేశాం. క్షేత్ర స్థాయిలో సదరు రైతు బంధు లబ్ధిదారుల భూములకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి పక్కా గా సర్వే చేశాం. ఇందులో ఎలాంటి పొరపాట్లు, పక్షపాతం లేదు. 681 ఎకరాలను సాగుకు యోగ్యత లేనివిగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం.
పి.గౌతమ్, వ్యవసాయ అధికారి, నార్కట్‌పల్లి