Share News

IBomma Ravi: తెలియదు.. గుర్తులేదు

ABN , Publish Date - Nov 23 , 2025 | 07:20 AM

సినిమా పైరసీ, బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌, మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవి...

IBomma Ravi: తెలియదు.. గుర్తులేదు

  • విచారణలో పోలీసులకు ‘ఐబొమ్మ’ రవి సమాధానాలివే!

  • అతణ్ని విచారించడానికి నేరుగా రంగంలోకి సీపీ సజ్జనార్‌!

  • త్వరలో సీఐడీ దర్యాప్తు!.. వివరాలు ఇవ్వనున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సినిమా పైరసీ, బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌, మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవి.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ అని సమాధానాలిస్తున్నట్టు సమాచారం. అతణ్ని ఐదురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు గత మూడు రోజులుగా విచారిస్తున్నారు. కానీ వారు రవి నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాబట్టలేకపోతున్నట్లు తెలిసింది. అతడి ల్యాప్‌ట్యాప్‌, మొబైల్‌లో ఉన్న డేటా విశ్లేషించడం కోసం యూజర్‌ ఐడీ, పాస్‌వర్డులు ఇవ్వాలని అడిగినా ఇదే సమాధానం చెప్తున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

దీంతో.. ఎథికల్‌ హ్యాకర్స్‌ సహకారంతో ఆయా పరికరాల్లోని డేటాను వెలికితీస్తున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా.. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల అదుపులో ఉన్న రవిని విచారించడానికి సిటీ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. శనివారం సీసీఎ్‌సకు వచ్చిన ఆయన.. ఐబొమ్మ రవితో మాట్లాడి పలు విషయాలు రాబట్టిట్లు సమాచారం. ముఖ్యంగా బెట్టింగ్‌ యాప్స్‌, మనీల్యాండరింగ్‌ మీదనే పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలిసింది. రవిని అరెస్టు చేసిన పోలీసులు అతనికి చెందిన 35 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. వాటిలోకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు డిపాజిట్‌ అయ్యాయి.. ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్లాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? వంటి వివరాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆయా ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల వివరాలు అందించాలని పోలీసులు బ్యాంకు అధికారులకు లేఖలు రాసినట్లు తెలిసింది. కాగా.. రవి ఖాతా నుంచి అతని చెల్లెలి ఖాతాలకు, అతని స్నేహితుడు నిఖిల్‌ ఖాతాలకు డబ్బులు డిపాజిట్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు. నిఖిల్‌ గురించి ఆరా తీయగా.. ఐ బొమ్మ పోస్టర్‌ డిజైన్‌ చేసింది నిఖిలే అని పోలీసుల విచారణలో తేలింది.


దర్యాప్తు.. సీఐడీకి!

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన ప్రముఖుల కేసును ప్రస్తుతం సీఐడీ పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ నటులు విజయ్‌దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌, రానా సహా.. పలువురిని సీఐడీ అధికారులు విచారిస్తున్నా రు. ఐ బొమ్మ రవి కేసులోనూ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ జరగడం, రూ. కోట్లలో కొల్లగొట్టినట్లు తేలడం, మనీల్యాండరింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సీఐడీ ఈ కేసును టేకప్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు సిటీ పోలీసులు పూర్తి వివరాలు సీఐడీకి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

Updated Date - Nov 23 , 2025 | 08:04 AM