Hydra Marshals Resign: వేతనాల తగ్గింపుపై మార్షల్స్ సామూహిక రాజీనామా
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:13 AM
జీతాల తగ్గింపునకు నిరసనగా హైడ్రాలో అవుట్ సోర్సింగ్ విధానంలో మార్షల్స్‌గా విధుల నిర్వహిస్తోన్న
వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
పూర్తి వేతనాలు ఇస్తామని స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీ/ రాంగోపాల్‌పేట్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జీతాల తగ్గింపునకు నిరసనగా హైడ్రాలో అవుట్ సోర్సింగ్ విధానంలో మార్షల్స్‌గా విధుల నిర్వహిస్తోన్న మాజీ ఆర్మీ, సీఐఎ్‌సఎఫ్ ఉద్యోగులు సోమవారం సామూహికంగా రాజీనామా చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీవీ మార్గ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యాలయం నుంచి బుద్ధభవన్ వద్ధ గల హైడ్రా కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చి హైడ్రా కమిషనర్‌కు తమ రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ జీతాన్ని రూ. 29,250 నుంచి రూ.22750కు తగ్గించడం అన్యాయమని అన్నారు. కాగా, ఈ విషయంపై రంగనాథ్ వెంటనే స్పందించారు. మార్షల్స్‌ను పిలిపించి మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంతకుముందులానే వేతనాలు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో వెంటనే మార్షల్స్ విధులకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మార్షల్స్‌కు రూ.23 వేలు హైడ్రా నుంచి మిగతా రూ.6 వేలు జీహెచ్‌ఎంసీ నుంచి చెల్లించే అవకాశముందని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.