Share News

Hydra : హైడ్రాకు 83 ఫిర్యాదులు

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:23 AM

పౌరుల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణను హైడ్రా ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌ వేదికగా ఫిర్యాదులు తీసుకున్న హైడ్రా.. సోమవారం ప్రజావాణిని చేపట్టింది.

 Hydra : హైడ్రాకు 83 ఫిర్యాదులు

ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజావాణి

పార్కులు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణపై ఫిర్యాదుల స్వీకరణ

హైదరాబాద్‌ సిటీ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): పౌరుల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణను హైడ్రా ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌ వేదికగా ఫిర్యాదులు తీసుకున్న హైడ్రా.. సోమవారం ప్రజావాణిని చేపట్టింది. ఉదయాన్నే టోకెన్లు ఇచ్చిన అధికారులు.. రెండు విడతలుగా ఫిర్యాదులను స్వీకరించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, నాలాల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు మాత్రమే ఈ సందర్భంగా స్వీకరించారు. ఇతర విభాగాలకు సంబంధించినవైతే.. ఆయా శాఖల ఉన్నతాధికారులను కలవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు 83 ఫిర్యాదులు రాగా, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్వయంగా పాల్గొన్నారు. ఫిర్యాదుదారులు చెప్పే విషయాలను ఆసాంతం విన్న కమిషనర్‌.. ఆయా అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. అధికారుల మొబైల్‌ నంబర్లను ఫిర్యాదుదారులకు ఇచ్చి.. వారితో టచ్‌లో ఉండాలని పేర్కొన్నారు. 3వారాల అనంతరం తనను మరోసారి కలిస్తే తీసుకున్న/తీసుకోబోయే చర్యలు చెబుతామన్నారు.

మాజీ సైనికుడి ఫిర్యాదు

ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి స్థలంతోపాటు పక్కనున్న పార్కు స్థలాన్ని ఆక్రమించిన మహిళపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లికి చెందిన మాజీ సైనికుడు సీతరామరాజు కోరారు. జవహర్‌నగర్‌లో సర్కారు భూమిని నోటరీలు చేసి విక్రయిస్తున్నారని, మొత్తం 6వేల ఎకరాల్లో 2500 ఎకరాలు మాత్రమే మిగిలిందని, దానిని కూడా ప్లాట్లుగా విక్రయిస్తున్నారని ముఖేశ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అక్కడ ఒకే వ్యక్తి 15 ఎకరాలను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. నీటిపారుదల శాఖ నాలాను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 60 గజాల చొప్పున ప్లాట్లు చేసి అమ్ముతున్నారని చిలుకానగర్‌ కార్పొరేటర్‌ భర్త ప్రవీణ్‌ ముదిరాజ్‌ రంగనాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనాజ్‌పూర్‌లో తన ప్లాటుకు ఒకవైపు ఉన్న రహదారిని పక్క ప్లాటుతో కలిపి విక్రయించారని, అదేంటని అడిగితే తనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట ఒకే స్థలానికి రెండు, మూడు లే అవుట్లు వేసి విక్రయించారని హయత్‌నగర్‌కు చెందిన ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, కుంట్లూరు తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. సాధారణంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తాయనుకుంటే.. అందుకు భిన్నంగా తూర్పు వైపు ప్రాంతాల నుంచి వచ్చాయని అధికారులు చర్చించుకోవడం కనిపించింది.

Updated Date - Jan 07 , 2025 | 05:23 AM