Share News

Outer Ring Road: ఔటర్‌ రాబడి హైస్పీడ్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:27 AM

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నట్టే.. టోల్‌ ఆదాయం కూడా వేగంగా పెరుగుతోంది...

Outer Ring Road: ఔటర్‌ రాబడి హైస్పీడ్‌

  • టోల్‌ సంస్థకు సగటుననెలకు రూ.70 కోట్ల వసూళ్లు

  • ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనేసమకూరిన రాబడి రూ.414కోట్లు

  • ఔటర్‌ నిర్వహణ, టోల్‌ వసూలు హక్కును 7,380 కోట్లకే 30 ఏళ్ల లీజుకిచ్చిన గత సర్కారు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నట్టే.. టోల్‌ ఆదాయం కూడా వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలు, ఏటా టోల్‌ పెంపుతో.. ఔటర్‌ను లీజుకు దక్కించుకున్న ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు మరింత రాబడి సమకూరుతోంది. ప్రస్తుతం ఆదాయం నెలకు రూ.70కోట్లు దాటింది. 2024 సంవత్సరంలో ఔటర్‌పై టోల్‌ వసూళ్ల ద్వారా రూ.764కోట్ల ఆదాయంరాగా.. ఈ ఏడాది 6 నెలలకే రూ.414 కోట్లు రావడం గమనార్హం. దేశవ్యాప్తంగా 17 జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఐఆర్‌బీ సంస్థ టోల్‌ నిర్వహణ చేపడుతుండగా.. అందులో అత్యధికంగా ఆదాయం వచ్చేవాటిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఒకటని తెలిసింది. హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్‌ రింగ్‌రోడ్డును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించిన విషయం తెలిసిందే. అది కూడా ఏకంగా 30 ఏళ్ల పాటు టోల్‌ వసూళ్ల హక్కును రూ.7,380కోట్లకే ధారాదత్తం చేసింది. 2023 ఆగస్టు 11న అర్ధరాత్రి నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఐఆర్‌బీ ఆధీనంలోకి తీసుకుంది. ఔటర్‌ను దాటి మరీ హైదరాబాద్‌ విస్తరిస్తుండడం, ఔటర్‌ వెంట బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తుండటంతో.. ఔటర్‌కు డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 2లక్షల వాహనాలు తిరుగుతున్నట్టు అంచనా. భవిష్యత్తులో వాహనాల సంఖ్య, టోల్‌ వసూళ్లు భారీగా పెరగనున్నాయి.

Updated Date - Aug 12 , 2025 | 06:27 AM