Share News

High Court: గ్రూప్‌-1 పిటిషన్లపై తీర్పు రిజర్వు

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:25 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో మూల్యాంకనం, సెంటర్ల కేటాయింపు సహా అనేక అక్రమాలు జరిగాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు సోమవారం తీర్పు రిజర్వు చేసింది.

High Court: గ్రూప్‌-1 పిటిషన్లపై తీర్పు రిజర్వు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో మూల్యాంకనం, సెంటర్ల కేటాయింపు సహా అనేక అక్రమాలు జరిగాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు సోమవారం తీర్పు రిజర్వు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదలు సురేందర్‌రావు, విద్యాసాగర్‌, రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. మరోవైపు ఎంపికైన అభ్యర్థులు, టీజీ పీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు డీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.


‘సాదాబైనామా’ సమస్య పరిష్కారమయ్యేనా?

  • నేడు హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టం అమల్లోకి వచ్చినా, సాదాబైనామా దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. హైకోర్టు స్టే విధించడంతో ఈ దరఖాస్తులను పరిష్కరించలేకపోతోంది. మంగళవారం సాదాబైనామాపై కోర్టు తీర్పు వస్తుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. సాదాబైనామాల విషయంలో అనధికారిక భూ లావాదేవీలు జరగవచ్చన్న అనుమానంతో హైకోర్టు 2020 నవంబరు11న స్టే విధించింది. ఆ తీర్పులో 2020 అక్టోబరు 29 తర్వాత వచ్చిన సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను ఆపాలని ఆదేశించింది. ఆ ఏడాది అక్టోబరు 12 నుంచి 28 మధ్య వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చని తెలిపింది.


అయితే తుది తీర్పు ఇచ్చేదాకా వాటికి చట్టబద్ధత కల్పించవద్దని ఆదేశించింది. అప్పటి నుంచి అంటే దాదాపు నాలుగున్నరేళ్లుగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దరఖాస్తుదారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భూభారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించినా, కోర్టులో స్టే ఉండడంతో ఏమీ చేయలేకపోతోంది. స్టే తొలగించాలంటూ సర్కారు వేసిన పిటిషన్‌పై మంగళవారం తీర్పు రానుంది. దాని ఆధారంగా ఈ సమస్యపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - Jul 08 , 2025 | 04:26 AM