Share News

AINU Hospital Inauguration: వైద్య రంగంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:34 AM

వైద్య రంగంలో హైదరాబాద్‌ ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోందని, నాణ్యమైన వైద్య సేవలకు ఇది కేంద్రంగా మారిందని..

AINU Hospital Inauguration: వైద్య రంగంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యం

  • ఏఐఎన్‌యూ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో హైదరాబాద్‌ ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోందని, నాణ్యమైన వైద్య సేవలకు ఇది కేంద్రంగా మారిందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌, చీఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రిని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ కొత్త ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 150 పడకలు, 4 ఆపరేషన్‌ థియేటర్లు, అత్యాధునిక రోబోటిక్‌ టెక్నాలజీతో కూడిన శస్త్రచికిత్స విభాగాలు ఇక్కడ ఉన్నాయని ఏఐఎన్‌యూ చైౖర్మన్‌, చీఫ్‌ యూరాలజిస్టు డాక్టర్‌ మల్లికార్జున వివరించారు.హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద నెఫ్రాలజీ, యూరాలజీ ఆస్పత్రి వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి రానుందని మల్లికార్జున, ఏఐఎన్‌యూ ఈడీ పూర్ణచంద్రా రెడ్డి తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా తమసేవలను విస్తరిస్తున్నామని, రూ.150 కోట్ల పెట్టుబడులతో మూడు నుంచి ఐదు కొత్త ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ఆసియా హెల్త్‌కేర్‌ హోల్డింగ్స్‌ (ఏహెచ్‌హెచ్‌) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ విశాల్‌ బాలి వెల్లడించారు. వీటిని పుణె, భువనేశ్వర్‌, పట్నా, కోయంబత్తూర్‌ నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు చెన్నై, వైజాగ్‌, సిలిగురిలో ఏఐఎన్‌యూ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. ఈ విస్తరణ పూర్తయితే, ఆసుపత్రుల పడకల సామర్థ్యం ఇప్పుడు ఉన్న 550 నుంచి 850కి పెరుగుతుందని బాలి తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 06:34 AM