High Court: ఇచ్చుకుంటూపోతే భవిష్యత్తులో ప్రభుత్వ భూమన్నదే ఉండదు
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:01 AM
ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లక్షలాది ఎకరాల భూమి ఉండేదని, ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వ భూమి అన్నదే మాయమవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్, జులై 7 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లక్షలాది ఎకరాల భూమి ఉండేదని, ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వ భూమి అన్నదే మాయమవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. భవిష్యత్తులో ప్రభుత్వం ఆధ్వర్యంలో మరుగుదొడ్డి నిర్మించాలన్నా స్థలం దొరకని పరిస్థితి రానుందని వ్యాఖ్యానించింది. భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచన లేకుండా ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కేటాయించడం, ఇప్పటికే ఆక్రమణలకు గురైన భూములను క్రమబద్దీకరించడం వల్ల మున్ముందు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.
వికారాబాద్ జిల్లా థరూర్ మండలం అంతరం గ్రామ పరిధిలో హేచరీ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించాలని వినతి పత్రం సమర్పించినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. హేచరీతో ప్రజలకు ఏం లాభం అని, మీ సొంత వ్యాపారాల కోసం ఏ ప్రాతిపాదికన భూమి అడుగుతున్నారని పిటిషనర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు స్థలం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వివరణ కోసం విచారణను ఈనెల 22కు వాయిదా వేశారు.