Share News

High Court: ఐసీడీఎస్‌లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయండి: హైకోర్టు

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:57 AM

ప్రభుత్వపరంగా మంజూరైన(శాంక్షన్డ్‌) ఐసీడీఎస్‌ ఉద్యోగాలు ఖాళీ ఉండగా ఆ స్థానంలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకొని, వారిని రెగ్యులర్‌ చేయకపోవడం తగదని హైకోర్టు అభిప్రాయపడింది.

High Court: ఐసీడీఎస్‌లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయండి: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వపరంగా మంజూరైన(శాంక్షన్డ్‌) ఐసీడీఎస్‌ ఉద్యోగాలు ఖాళీ ఉండగా ఆ స్థానంలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకొని, వారిని రెగ్యులర్‌ చేయకపోవడం తగదని హైకోర్టు అభిప్రాయపడింది. దశాబ్దాలపాటు వారితో పనిచేయించుకుని మళ్లీ కొత్తగా జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అదే ఉద్యోగాలకు పోటీపడాలని చెప్పడం చెల్లదని స్పష్టం చేసింది. 265 ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2 పోస్టులకు 2013లో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. అప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో అదే ఉద్యోగాలు చేస్తున్న వారికి 15శాతం వెయిటేజీ ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2013 నాటికే ఆరు నుంచి పదిహేనేళ్లపాటు సర్వీసు చేసిన తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించకుండా అవే పోస్టులను రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయడం చెల్లదని అంగన్వాడీ టీచర్‌ మీరాబాయి సహా దాదాపు 200 మంది ఐసీడీఎస్‌ కాంట్రాక్టు ఉద్యోగులు 2013లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఆర్టికల్‌ 226 కింద దాఖలుపడ్డ అధికారాల ద్వారా పిటిషనర్ల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని ఆదేశాలు జారీచేస్తున్నట్లు పేర్కొంది. కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన నాటి నుంచి సర్వీసు లెక్కగట్టి పింఛను, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేయాలని స్పష్టంచేసింది. వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించగా మిగిలిన పోస్టులను భర్తీచేసుకోవచ్చని తెలిపింది.


జగన్మోహన్‌రావుకు బెయిల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): అవినీతి, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ తదితర అభియోగాలపై సీఐడీ అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుకు హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. అరెస్ట్‌ చేసి 45 రోజులు అవుతున్నా ఇంకా దర్యాప్తు కొనసాగుతుండటంతో బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - Aug 29 , 2025 | 04:57 AM