Share News

PET Scan: పెట్‌ స్కానింగ్‌లో వాడే నీళ్లు.. లీటరు 25 లక్షలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:46 AM

క్యాన్సర్‌ పెట్‌ స్కానింగ్‌లో వాడే ఓఎటైన్‌ నీటిని అశ్వాపురంలోని మణుగూరు భారజల కర్మాగారంలో తయారు చేస్తున్నామని హెవీవాటర్‌ బోర్డు చైర్మన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె.సత్యకుమార్‌ తెలిపారు.

PET Scan: పెట్‌ స్కానింగ్‌లో వాడే నీళ్లు.. లీటరు 25 లక్షలు

మణుగూరు భారజల కర్మాగారంలో తయారవుతాయి

  • అశ్వాపురం, కోటా ప్లాంట్ల సామర్థ్యం పెంచేలా చర్యలు

  • భవిష్యత్‌ అంతా న్యూక్లియర్‌ విద్యుత్తుదే

  • 2047 నాటికి 100 గెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం

  • హెవీవాటర్‌ బోర్డు చైర్మన్‌ సత్యకుమార్‌ వెల్లడి

భద్రాచలం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ పెట్‌ స్కానింగ్‌లో వాడే ఓఎటైన్‌ నీటిని అశ్వాపురంలోని మణుగూరు భారజల కర్మాగారంలో తయారు చేస్తున్నామని హెవీవాటర్‌ బోర్డు చైర్మన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె.సత్యకుమార్‌ తెలిపారు. శుక్రవారం తన కుటుంబసభ్యులు, అశ్వాపురం ప్లాంటు జీఎం జి.శ్రీనివా్‌సతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమృత్‌కాల్‌ 2047లో భాగంగా దేశంలోని నాలుగు కీలకమైన మణుగూరు, కోటా, అజీరా, తాల్‌ హెవీ వాటర్‌ ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచుతున్నామని, ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలిపారు. అలాగే భారత్‌ ఇంతకాలం క్యాన్సర్‌ నిర్ధారణలో వాడే పెట్‌స్కానింగ్‌లో ఉపయోగించే అబ్జర్‌ ఎటైన్‌ నీటిని అమెరికా, ఇజ్రాయెల్‌, కువైట్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకునేదని, ప్రస్తుతం అశ్వాపురం ప్లాంట్‌లో ఆ నీటిని తయారు చేస్తున్నామని తెలిపారు.


లీటర్‌ నీరు రూ.25 లక్షల వరకు ఉంటుందని, ఇంత ఖరీదైన నీటిని రాజస్థాన్‌లోని కోటా, అశ్వాపురం ప్లాంట్లలోనే తయారు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమివ్వడంతో మణుగూరు, కోటాలో మరింతగా భారజలం ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి 100 గెగావాట్ల న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసేందుకు అవసరమైన భారజలాన్ని తయారు చేసి అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని పేర్కొన్నారు. అశ్వాపురం ప్లాంట్‌లో బోరాన్‌ కార్పైట్‌ పెల్లట్స్‌ను కూడా తయారు చేస్తున్నామని, వాటిని రెండోతరం న్యూక్లియర్‌ విద్యుత్‌ తయారీలో ఉపయోగిస్తారని సత్యకమార్‌ తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 03:46 AM