Heavy Traffic: హైవేపై వాహనాల రద్దీ
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:28 AM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై
చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై బారులు
దుద్దెడ టోల్‌ప్లాజా వద్ద అదే పరిస్థితి..
చౌటుప్పల్ టౌన్/కొండపాక, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. శనివారం రాఖీ పండుగ, ఆదివారం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉండడంతో పట్టణం కిటకిటలాడింది. హైవేపై ఇరు వైపులా వాహనాలు బారులు తీరగా, సర్వీస్ రోడ్లతోపాటు భువనగిరి, మునుగోడు వెళ్లే రహదారులు బైకులు, పాదచారులతో నిండిపోయాయి. హైవేపై జంక్షన్ల వద్ద దాటాలంటే 10-15 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. రాఖీ పండుగకు వెళ్లిన హైదరాబాదీలు ఆదివారం సాయంత్రం నుంచి తిరుగు పయనమయ్యారు. ఇక ఆర్టీసీ బస్సులూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగింది. రాఖీతో పాటు వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
