Heavy Rains Paralyze Hyderabad: రాజధానిపై మళ్లీ కుంభవృష్టి
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:30 AM
హైదరాబాద్‌పై మరోసారి వరుణుడు మరోసారిపడగ విప్పాడు. నిర్దయగా విరుచుకుపడ్డాడు. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు.. ఎక్కడెక్కడి నుంచో మేఘాలన్నీ ఒక్కచోటకొచ్చి బద్ధలై కురిశాయా అన్నట్టుగా ఆ ఉదృతికి నగరజీవులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షణాల్లో..
రాత్రి 3 గంటలపాటు ఏకధాటిగా వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు, ఇళ్లలోకి వరద
మియాపూర్ హైవేపై కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
ముషీరాబాద్‌లో 15 సెం.మీ, మోండామార్కెట్‌లో 13 సెం.మీ.ల వర్షపాతం నమోదు
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండండి.. అధికార్లకు సీఎం ఆదేశం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌పై మరోసారి వరుణుడు మరోసారిపడగ విప్పాడు. నిర్దయగా విరుచుకుపడ్డాడు. ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్నట్టు.. ఎక్కడెక్కడి నుంచో మేఘాలన్నీ ఒక్కచోటకొచ్చి బద్ధలై కురిశాయా? అన్నట్టుగా ఆ ఉదృతికి నగరజీవులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షణాల్లో ప్రధాన రోడ్లు చెరువులుగా మారిపోతే.. మోకాలి లోతు ఆ నీళ్లలో కార్లు, ద్విచక్రవాహనాలను ముందుకు కదిలించలేక వాహనదారులు గోసపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద పోటెత్తింది. పార్క్ చేసిన బైక్‌లు నీట మునిగాయి. గడపదాటి లోపలికి దూకిన వరద.. ఇళ్లలోని బియ్యం, పప్పులు ఇతర నిత్యావసర సరుకులను తడిపేసింది. ఆ ఇళ్లలోని బాధితులకు నిద్రలేని రాత్రిని మిగిల్చింది. బుధవారం రాత్రి 8గంటల నుంచి 11 గంటల దాకా ఎక్కడా తగ్గకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిఽధిలో కుండపోత వర్షం పడింది. మియాపూర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, అమీర్‌పేట, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. కేవలం మూడు గంటల్లో.. ముషిరాబాద్ 15 సెం.మీ, మోండామోర్కెట్‌లో 13 సెం.మీ, మారెడ్‌పల్లిలో 13సెం.మీ.. శేరిలింగంపల్లి హెచ్‌సీయూ యూనివర్సిటీ ప్రాంతంలో 12.6 సెం.మీ, మియాపూర్‌లో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. యూసు్‌ఫగూడ కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరదనీరు భారీగా ప్రవహించడంతో వాహనాలు సగానికి పైగా నీటమునిగాయి. స్థానికులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. కుత్బుల్లాపూర్ సంజీవ్‌నగర్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. మారేడ్‌పల్లి, ముషీరాబాద్, షేక్‌పేట, బాలానగర్, గోల్కొండ, ముషీరాబాద్,లో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. మియాపూర్-చందానగర్ జాతీయ రహదారిపై పెద్ద మొత్తంలో వరద చేరడంతో రాత్రి 11 గంటల వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఖైరతాబాద్ సచివాలయం ఎదురురోడ్డు, లక్డీకాపూల్ వీఎస్టీ ప్రధానర హదారులపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి బయోడైవర్సిటీ చౌరస్తా మీదుగా రాయదుర్గం, షేక్‌పేట, టోలిచౌకి, నానల్‌నగర్, మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఎర్రమంజిల్ మీదుగా పంజాగుట్ట, అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్, ఈఎ్‌సఐ ఎర్రగడ్డ వరకు ప్రధాన రహదారిపై వర్షపు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. ట్యాంక్‌బండ్ నుంచి రాణిగంజ్-ప్యారడైజ్ మార్గంతో పాటు ఎంజీరోడ్డు-ప్యాట్నీ మార్గంలో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీఎస్టీ ప్రధానరహదారిపై మోకాలిలోతు వరదనీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడింది. కరీంనగర్, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, ములుగు జిల్లాలో వర్షం పడింది. మెదక్ జిల్లా శివ్వంపేటలో 6.9 సెం.మీ, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 6 సెం.మీ, భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో 4.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో ఓ 20 మంది కూలీలు గోదావరి పాయ ఆవలివైపు చిక్కుకుపోయారు. జేసీబీ సాయంతో వారిని ఈవలివైపు సురక్షితంగా తీసుకొచ్చారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపెట గ్రామ ఊటచెరువుకు గండిపడటంతో 180 ఎకరాల పంట నీటమునిగింది.
అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు: సీఎం
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన చోట పోలీసులు, హైడ్రా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఉన్న చోట్ల ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు విభాగాల అధికారులు అధిక వర్షం పడిన ప్రాంతాల్లో అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


