Heavy Rainfall: ముంచెత్తిన వాన
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:24 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి....
సిద్దిపేట జిల్లా వర్గల్‌లో అత్యధికంగా 23 సెం.మీ. వర్షపాతం
జాలువారిన పత్తి.. వేలాది ఎకరాల్లో పంట నష్టం
నేడు, రేపు అతి భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
నీట మునిగిన ఏడు పాయల వనదుర్గ గుడి
మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షం
ములుగు జిల్లాలో వాగులో పడి మహిళ మృతి
వేలాది ఎకరాల్లో పంటల నష్టం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. వర్షాల ధాటికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా.. పలు చోట్ల రాకపోకలకు విఘాతం కలిగింది. కొన్ని పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వాన పడగా, మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 22, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో దాదాపు 4 వేల ఎకరాలపైగా వరి, పత్తి, కూరగాయల పంటలు నీటమునిగాయి. తొగుట, రాయపోల్ మండలాల్లో కురిసిన వర్షానికి పలు ఇళ్లు కూలిపోయాయి. మర్కూక్ మండలంలోని చేబర్తి గ్రామంలో మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గల ప్రధాన కాలువ ధ్వంసమైంది. ములుగులో 18.6, రాయపోల్‌లో 16.3, మర్కూక్‌లో 14.2, కొమురవెల్లిలో 12, గజ్వేల్‌లో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్ పరిధిలోని నల్ల వాగు, జహీరాబాద్‌లోని నారింజ వాగు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. జిల్లా పరిధిలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో 10మండలాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్‌లో పోలీసు స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. టేక్మాల్ మండలం బుడ్మట్‌పల్లిలో ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. అల్లాదుర్గం ప్రధాన రాహదారిపై ప్రవహిస్తున్న నీటి ఉధృతికి ఓ బైక్ కొట్టుకుపోయింది. గడిపెద్దాపూర్‌లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏడుపాయల వనదుర్గ గర్భ గుడిలోకి వరద నీరు ప్రవేశించడంతో అమ్మ వారికి నిత్యపూజలు నిలిపివేశారు. ఉత్సవమూర్తికి పూజలు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్‌లో 16.2 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, కోటగిరి మండలంలో 14.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రుద్రూర్ - బొప్పాపూర్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బోధన్ మండలం హంగర్గలో పంట పొలాల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. మేడ్చల్ జిల్లాలోని ఈఎ్‌సఎస్ కేశవరంలో అత్యధికంగా 10.9, శామీర్‌పేట మండలం అలిబాద్‌లో 9.5, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్దఉమ్మెంతాల్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపిలేకుండా జల్లులు పడుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని సీసీకుంట మండలంలో 6, మూసాపేటలో 5.1, నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లిలో 8.44, వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 8.06, నారాయణ పేట జిల్లా కేంద్రంలో6.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గద్వాల జిల్లాలో భారీ వర్షాల దాటికి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తి చేలలో పూత, గూడ (పిందె) రాలుతోందని రైతులు వాపోయారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న 900చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ డివిజన్ల పరిధిలో భారీ వర్షం కురిసింది. బిచ్కుంద, పిట్లం, జుక్కల్, మధ్నూర్, బీర్కూర్ మండలాల్లోని 900ల ఎకరాల్లో సోయా, పత్తి, వరి పంటలు నీట మునిగాయి. బిచ్కుంద మండలంలో మంజీర వరదలో చిక్కుకున్న నలుగురు గొర్రెల కాపర్లను, 656 గొర్రెలను పోలీసులు సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వెంకట్‌రావుపేట వద్ద పెన్‌గంగా వంతెనకు ఆనుకొని ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోలెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో సిర్పూర్(టి)-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో మహిళ మృతి
ములుగు జిల్లా భారీ వర్షాలు పడుతుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో సగటున 39.3సెంటీమీటర్ల వర్షం కురిసింది. తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని తూముల వాగులో పడి సోలం గౌరమ్మ (40) మృతి చెందింది. మంగపేట మండలంలోని కమలాపురంలో 30 ఇళ్లల్లోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందలాది ఎకరాల పొలాలు నీటమునిగాయి.