Godavari Swells Krishna Overflows: గోదావరి ఉరకలు.. కృష్ణమ్మ పరవళ్లు
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:20 AM
మహారాష్ట్రతోపాటు ఎగువనున్న ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దాటికి గోదావరి ఉరకలు వేస్తోంది. మరోవైపు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్ల ఎత్తివేత
శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలంలో 10, సాగర్ 26 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్/నాగార్జునసాగర్/గద్వాల/బ్రహ్మగిరి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రతోపాటు ఎగువనున్న ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దాటికి గోదావరి ఉరకలు వేస్తోంది. మరోవైపు.. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రెండు బేసిన్లలోని ప్రధాన జలాశయాలు నీటితో నిండిపోగా, వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,25,400 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 39గేట్ల ద్వారా 1.51లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా మిడ్‌మానేరుకు 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091(నీటి నిల్వ సామర్థ్యం 81టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1,089 అడుగుల (79టీఎంసీల) మేర నీరు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.17లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మిడ్‌మానేరు జలాశయానికి 18,865 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. తాజా ఇన్‌ఫ్లోల ప్రకారం ఈనెల 20 నుంచి మిడ్‌మానేరు నుంచి నీటిని పంపింగ్ చేయడానికి వీలు కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 310.68మీటర్ల మేర నీరు నిల్వ ఉండగా, 311.14 మీటర్ల(13.13 టీఎంసీల)కు చేరితే ఒక పంపు, 14.94 టీఎంసీలకు చేరితే రెండు పంపులు, 313.19 మీటర్ల(16.76 టీఎంసీల)కు చేరితే మూడు పంపులు, 317.31 మీటర్ల(25.77 టీఎంసీల)కు చేరితే నాలుగు మోటార్లు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద సోమవారం ఉదయం 13.490 మీటర్లకు చేరిన గోదావరి ఆ తర్వాత క్రమంగా తగ్గు ముఖం పట్టింది. సాయంత్రం 5గంటలకు 13.450మీటర్ల వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ కుంగినా, అన్నారం సుందిళ్లలో ఒక్క నీటి చుక్కనూ ఆపకున్నా.. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ జల కళ సంతరించుకున్నాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 37.5 అడుగులు ఉండగా.. 39 అడుగులకు వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం, సాగర్‌కు పోటెత్తిన వరద
కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.29లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... 10 క్రస్ట్‌గేట్లను ఎత్తి 4.03లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 3.31లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 26క్రస్ట్ గేట్లు ఎత్తి 2.93 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ సీజన్‌లో 3లక్షల క్యూసెక్కులపైగా వరద రావడం ఇదే మొదటిసారి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.045టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 585.90 అడుగుల(3000.031) మేర నీటి నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు 2.47 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... 3.10 లక్షల క్యూసెక్కులను వదిలారు. ఇక ఎగువన ఉన్న ఆల్మట్టికి 87వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 1.25లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు1.35లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.40లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో రికార్డయింది. జూరాల ప్రాజెక్టుకు 1.85 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..1.79 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది.