Damodar Rajanarsimha: ‘గాంధీ’లో మంత్రి దామోదర తనిఖీలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:22 AM
రోగులతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో అందుతున్న సేవలు, మందుల సరఫరాపై ఆరా తీశారు. ఆ తర్వాత ఓపీ వార్డు వెనుక వైపు ఉన్న మదర్ అండ్ చైల్డ్ సెంటర్ (ఎంసీహెచ్)వార్డులో తనిఖీలు చేశారు.
వైద్యులు, ప్రొఫెసర్ల గైర్హాజరుపై ఆగ్రహం
20 మందికి నోటీసులు ఇవ్వాలని ఆదేశం
అడ్డగుట్ట/హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆస్పత్రికి చేరుగానే నేరుగా ఔట్ పేషెంట్ వార్డుకు వెళ్లిన మంత్రి... రోగులతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో అందుతున్న సేవలు, మందుల సరఫరాపై ఆరా తీశారు. ఆ తర్వాత ఓపీ వార్డు వెనుక వైపు ఉన్న మదర్ అండ్ చైల్డ్ సెంటర్ (ఎంసీహెచ్)వార్డులో తనిఖీలు చేశారు. ఈ సెంటర్‌లోని 5వ అంతస్తులో విధులు నిర్వర్తిస్తున్న నర్సులు, గైనకాలజీ విభాగాధిపతులతో మాట్లాడారు. వైద్య రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్లు తీసుకురావాలని మంత్రి ఆదేశించగా.. అరగంట వరకూ జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ డాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నారన్న సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇలాగైతే కష్టమేనని వైద్యులు, నర్సులపై మండిపడ్డారు. ఉదయం 12 గంటలకు కూడా ఓపీకి రాని వైద్యుల వివరాలతో నివేదిక తయారు చేసి, తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. ఓపీలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కనిపించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని ఐవీఎఫ్ సెంటర్‌ను ప్రారంభించి ఎనిమిది నెలలు అవుతున్నా.. సేవలు ప్రారంభించకపోతే ఎలా? అని నిలదీశారు. మంత్రి పర్యటించినప్పుడు సుమారుగా 20 మంది విధుల్లో లేరని తెలిసింది. ఈ సందర్భంగా వారందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని వైద్య విద్య సంచాలకుడు నరేంద్రకుమార్‌ను మంత్రి ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు.
‘నర్సింగ్ కౌన్సిల్’ అక్రమాలపై విచారణ!
నర్సింగ్ కౌన్సిల్‌లో జరుగుతున్న అక్రమాలపై ‘నర్సింగ్ కౌన్సిల్ పైసా వసూల్’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. కౌన్సిల్ అధికారుల వసూళ్ల పర్వంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. కాగా, కౌన్సిల్ అక్రమాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ బృందాలూ రంగంలోకి దిగాయి. కాలేజీల నుంచి వసూళ్ల పర్వంపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాయి.