Share News

Telangana High Court has stayed: లిక్కర్‌ షాపుల దరఖాస్తు గడువు పెంపును వ్యతిరేకిస్తూ పిటిషన్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:46 AM

ఓ భూవివాదానికి సంబంధించి తెలంగాణ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.

Telangana High Court has stayed: లిక్కర్‌ షాపుల దరఖాస్తు గడువు పెంపును వ్యతిరేకిస్తూ పిటిషన్‌

  • లోకాయుక్త ఆదేశాలపై హైకోర్టు స్టే

  • ఆక్రమణదారులకే భూములు కేటాయించాలంటూ ఉత్తర్వులు

  • ఆ అధికారం లోకాయుక్తకు లేదని కలెక్టర్‌ పిటిషన్‌

  • మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ట్రస్ట్‌పై వ్యాజ్యం

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఓ భూవివాదానికి సంబంధించి తెలంగాణ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఆక్రమించుకున్న భూములను సంబంధిత వ్యక్తులకే కేటాయించే అధికారం లోకాయుక్తకు లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ‘శ్రీ సూర్య చంద్ర శ్రీసాయి సేవాలాల్‌ మహారాజ్‌ ట్రస్ట్‌’ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేసి, ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం మహబూబాబాద్‌ జిల్లా అనంతారం గ్రామ పరిధిలో 10-15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయన లోకాయుక్తకు వివరణ ఇస్తూ స్థానిక గిరిజనుల కోరిక మేరకు ఆలయం నిర్మించడానికి కేవలం 1.07 ఎకరాలు మాత్రమే తీసుకున్నట్లు పేర్కొన్నారు. తీసుకున్న ఈ స్థలం కోసం తగిన ధర ప్రభుత్వానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన లోకాయుక్త.. ఆ స్థలాన్ని ట్రస్టుకు లీజుకు ఇవ్వాలని, లేదంటే కనీస ధరకు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. ఇది తెలంగాణ లోకాయుక్త చట్టం - 1983, తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (బదిలీపై నిషేధం) చట్టం- 1977కి విరుద్ధమని పేర్కొంటూ మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా గురువారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. వివరణ ఇవ్వాలని లోకాయుక్త రిజిస్ట్రార్‌, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లకు నోటీసులు జారీచేస్తూ విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది.

మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హరీందర్‌పాల్‌ సింగ్‌ బంగా, మాన్‌జీత్‌సింగ్‌ బగ్గా, డి. వెంకటేశ్వరరావు తదితరులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. లైసెన్స్‌ నిబంధనలకు విరుద్ధంగా గడువు తేదీని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ పొడిగించారని తెలిపారు. ఈనెల 18 తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించకుండా ఆదేశాలు జారీచేయాలని కోరారు.

Updated Date - Oct 24 , 2025 | 05:46 AM