Share News

High Court: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే విద్యుత్‌ కనెక్షన్‌

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:07 AM

నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తిచేసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే నూతన విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు స్పష్టంచేసింది.

High Court: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే విద్యుత్‌ కనెక్షన్‌

  • విద్యుత్తు పంపిణీ సంస్థకు హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తిచేసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే నూతన విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు స్పష్టంచేసింది. వినియోగదారులు తొలుత జీహెచ్‌ఎంసీ లేదా ఇతర మున్సిపాల్టీల అధికారుల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందాలని, ఆ సర్టిఫికెట్‌ సమర్పించిన తర్వాతే నిబంధనల ప్రకారం నివాస గృహాలకు నూతన కనెక్షన్‌ ఇవ్వాలని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం నిర్మించిన స్టిల్ట్‌ + ఐదు అంతస్థుల భవనానికి అన్ని రకాల ఫీజులు చెల్లించినప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేదనే కారణంతో విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదని పేర్కొంటూ రెడ్‌హిల్స్‌కు చెందిన మొహమ్మద్‌ ఆరిఫ్‌ రిజ్వాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


వాదనలు విన్న జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం.. అధికారుల నుంచి ఒకరకమైన బిల్డింగ్‌ ప్లాన్‌కు అనుమతి పొంది ఆ తర్వాత ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంలో దరఖాస్తు చేసుకుని తమ అక్రమ నిర్మాణాలను చట్టబద్ధం చేసుకోవాలని చూస్తున్నారని తెలిపింది. ఇలాంటి అక్రమ విధానాలు కొనసాగుతుంటే ఈ కోర్టు చూస్తూ నిశ్శబ్దంగా ఊరుకోదని పేర్కొంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని స్పష్టంచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Aug 17 , 2025 | 04:07 AM