Telangana High Court: 42శాతం జీవో ఎలా ఇస్తారు?
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:12 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9కు చట్టబద్ధత ఉందా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది...
ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం కింద రిజర్వేషన్లు 50 శాతం మించరాదు
సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేదు
బీసీలకు రిజర్వేషన్లు మంచి ఉద్దేశమే
చేసేదేదో చట్ట ప్రకారం ఉండాలి
జీవో 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు
స్టే ఇవ్వకుండానే విచారణ 8కి వాయుదా
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా విచారణ ఆగదు
ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
అసెంబ్లీకి శాసనం చేసే అధికారముంది
పిటిషనర్లు కూడా ప్రశ్నించలేదు: ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9కు చట్టబద్ధత ఉందా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని 285(ఏ) సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని పరిమితి విధిస్తూ స్పష్టమైన నిబంధన ఉందని గుర్తు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే పరిమితిని తొలగిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా చట్ట సవరణ చేసినప్పటికీ దానికి గవర్నర్ ఆమోదం ఇంకా పొందలేదని ప్రస్తావించింది. సవరణకు గవర్నర్ ఆమోదం లేకుండా కేవలం బిల్లు ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో ఎలా ఇస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులతో పాటు పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకమని పేర్కొంటూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన బి.మాధవరెడ్డి, ఎస్.రమేశ్ తదితరులు హైకోర్టు శనివారం రెండు హౌజ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించరాదని కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వికాస్ కిషన్‌రావు గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చిందని గుర్తుచేశారు. పంచాయతీరాజ్ చట్టం, సుప్రీంకోర్టు తీర్పులు అమలులో ఉండగా ప్రభుత్వం జీవో 9 జారీచేయడం చెల్లదని పేర్కొన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని కోరారు. తమిళనాడులో 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తూ దానిని 9వ షెడ్యూల్‌లో చేర్చారని, దానిపై కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రస్తావించారు. రాష్ట్రాలు పంపిన బిల్లులను మూడు నెలల్లో రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, తమకు గడువు ఎలా విధిస్తారని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు రిఫరెన్స్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్ మూడు నెలల్లో ఆమోదం తెలిపాల్సిందే అని అనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరణ బిల్లుకు ఇంకా మూడు నెలలు కాలేదని ప్రస్తావించారు. హైకోర్టుకు సెలవులు ఉన్న రోజు చూసి జీవో ఇచ్చారని ఆరోపించారు.
అసెంబ్లీకి అధికారముంది
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదించారు. గవర్నర్ ఆమోదం ముఖ్యం కాదని, శాసన అధికారం అసెంబ్లీకి ఉందా లేదా? అన్నదే ముఖ్యమని చెప్పారు. చట్ట సవరణ చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి కచ్చితంగా ఉందని, జీవో జారీ చేయడంలో ఎలాంటి చట్టవ్యతిరేక చర్య లేదని తెలిపారు. శాసనసభకు ఆ అధికారం లేదని పిటిషనర్లు కూడా అనడం లేదని అన్నారు. బీసీల వెనకబాటుతనాన్ని అంచనా వేయడానికి డెడికేటెడ్ కమిషన్ వేసి, లెక్కలు తీసిన తర్వాతే శాస్ర్తీయంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లులను శాసనసభలో ఎవరూ వ్యతిరేకించలేదని, ఏకగ్రీవంగా సభ ఆమోదం పొందాయని గుర్తు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించిన ఇంత సంక్లిష్టమైన విషయాన్ని హౌజ్‌మోషన్ రూపంలో విచారించడం సబబు కాదని, ప్రభుత్వం నుంచి సూచనలు అందుకునేందుకు కనీస సమయం ఇవ్వాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి అంత అత్యవసరం ఏముందని.. ఎలక్షన్లు వాయిదా వేసి, చట్టప్రకారం అన్ని అడ్డంకులు తొలగిన తర్వాత నిర్వహించుకోవచ్చని సూచించింది.
దసరా సెలవుల తర్వాత వరకైనా ఎన్నికలు వాయిదా వేసే అంశంపై ప్రభుత్వం నుంచి సూచన తీసుకోవాలని ఏజీని కోరింది. ఏజీ ఫోన్‌లో ప్రభుత్వ వర్గాలను సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఎవరూ అందుబాటులో లేరని, దసరా సెలవుల తర్వాతకు విచారణను వాయిదా వేయాలని కోరారు. సంక్లిష్టమైన అంశంలో అత్యవసరంగా విచారణ చేపట్టడం సబబు కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపితే ఎన్ని రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది? అని ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎ్‌సఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ను ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపిన తర్వాత ఒకటి రెండురోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని ఎస్‌ఈసీ న్యాయవాది తెలిపారు. అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం వివరణ ఇవ్వాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబరు8వ తేదీకి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చినా బీసీ రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన ఈ పిటిషన్లు సర్వైవ్ అవుతాయని, వీటిపై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టంచేసింది. నోటిఫికేషన్ కంటే ముందే ఈ పిటిషన్లు దాఖలయ్యాయి కాబట్టి నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా మెరిట్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్లు రెగ్యులర్ రోస్టర్ కలిగిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి. కాగా ప్రస్తుతానికి ఎలక్షన్ నోటిఫికేషన్ పై గానీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై గానీ హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదు.