Share News

Harish Rao: బనకచర్లను అడ్డుకొని తీరతాం

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:31 AM

నిబంధనలకు విరుద్ధంగా.. తెలంగాణకు అన్యాయం జరిగేలా.. మీరు బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరతామంటే.. మేం అడ్డుకొని తీరతాం’’ అని మాజీమంత్రి హరీశ్‌ రావు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Harish Rao: బనకచర్లను అడ్డుకొని తీరతాం

  • లోకేశ్‌ వ్యాఖ్యలపై సీఎం స్పందించరా?: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘నిబంధనలకు విరుద్ధంగా.. తెలంగాణకు అన్యాయం జరిగేలా.. మీరు బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరతామంటే.. మేం అడ్డుకొని తీరతాం’’ అని మాజీమంత్రి హరీశ్‌ రావు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బలం, రేవంత్‌రెడ్డి అండ చూసుకొని.. కేంద్రం అనుమతులు సాధిస్తాం.. బనకచర్ల కట్టితీరతామని.. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెగింపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఏపీలో అధికారం, కేంద్రం మద్దతు ఉందని ఏదిపడితే అది మాట్లాడటం తగదని పేర్కొన్నారు. లోకేశ్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని, సీఎం, మంత్రులు ఎవరూ ఖండించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడంతోపాటు ఢిల్లీ మెప్పుకోసం ప్రయత్నిస్తున్న రేవంత్‌కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడంలేదని విమర్శించారు.


తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, బనకచర్లను ఆపేవరకు పోరాడతామని, అవసరమైతే.. బీఆర్‌ఎస్‌ సుప్రీం కోర్టుకు వెళ్తుందని చెప్పారు. తెలంగాణ హక్కులకు ఇబ్బంది కలగకుండా ఏపీలో ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై లోకేశ్‌కు అవగాహన లేదని, అందుకే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. లోకేశ్‌ చెప్పేది నిజమైతే.. కేంద్రం పరిధిలోని నాలుగు సంస్థలు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఎందుకు తిరస్కరించాయని ప్రశ్నించారు. మిగులు జలాలున్నాయని ఎవరు చెప్పారు?.. ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని టీఎంసీలు కేటాయించారో వెల్లడించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల్లేవని లోకేశ్‌ చెప్పడం అబద్ధమని, అది కొత్త ప్రాజెక్టు కాదని, ప్రాణహితలో అంతర్భాగం కాబట్టి.. రాష్ట్ర పునర్విభజన చట్టం వర్తించదని కేంద్రం స్పష్టంగా పేర్కొందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును టీడీపీ అడ్డుకోలేదని చెప్పడం తగదని, కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి ఏడు ఉత్తరాలు రాశారని వెల్లడించారు.

Updated Date - Aug 02 , 2025 | 04:31 AM