Share News

Harish Rao: బీఆర్‌ఎస్‌ హయాంలో బనకచర్ల ఊసేలేదు

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:51 AM

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రస్తావనేరాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకుని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అని మాజీమంత్రి హరీశ్‌రావు నిలదీశారు.

Harish Rao: బీఆర్‌ఎస్‌ హయాంలో బనకచర్ల ఊసేలేదు

  • అవగాహన లేని సీఎం ఉండటం తెలంగాణ దౌర్భాగ్యం

  • కాంగ్రె్‌సను మేమే నిద్రలేపాం : మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రస్తావనేరాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకుని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అని మాజీమంత్రి హరీశ్‌రావు నిలదీశారు. తమ హయాంలోనే ప్రాజెక్టుకు సహకరించామంటూ సీఎం చెబుతున్నవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైతే.. కాంగ్రె్‌సను నిద్రలేపింది తామేనని, బీఆర్‌ఎస్‌ చేసిన పోరాటం వల్లే బనకచర్లకు పర్యావరణ అనుమతులు లభించలేదని మంగళవారం ఎక్స్‌వేదికగా ఆయన తెలిపారు. రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాల దృష్ట్యా.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేయాలని సీఎం ఎందుకు డిమాండ్‌ చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల రేవంత్‌రెడ్డి చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా?.. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సాగు నీటి వనరులు, నదీజలాల వాటాపై కనీస అవగాహన లేని వారు ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని పేర్కొన్నారు.


అందాల పోటీల కోసం తరచూ రివ్యూలుపెట్టిన సీఎం యూరియా సరఫరాపై ఒక్కసారి సమీక్షించినా.. ఇప్పుడు యూరియా కొరత వచ్చేది కాదన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ఆధారంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని మూడు బడ్జెట్‌ ప్రసంగాల్లోనూ (ఓటాన్‌ అకౌంట్‌తో సహా) చెప్పారని.. కానీ రూపాయి కూడా విదల్చలేదని చెప్పారు. ’పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చడం దుర్మార్గమని, రేవంత్‌రెడ్డి సాగిస్తున్న ఈ అరాచకాన్ని ఆపలేరా? మీనాక్షీ నటరాజన్‌’ అంటూ.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిని ఎక్స్‌ వేదికగా హరీశ్‌రావు ప్రశ్నించారు. కోర్టు స్టే ఉన్నా.. ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమేనన్నారు. ఉత్తరప్రదేశ్‌ తరహా ’బుల్డోజర్‌పాలన’ను తెలంగాణలో నడపొద్దని రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సూచించారు. తెలంగాణ సీఎంను రాజ్యాంగ విలువలకు, కాంగ్రెస్‌ చెబుతున్న సిద్ధాంతాలకు లోబడి నడుచుకునేలా ఆదేశించాలని మీనాక్షిని ఆయన కోరారు.

Updated Date - Jul 02 , 2025 | 04:51 AM