Share News

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:01 AM

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను తుక్కు తుక్కుగా ఓడించారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. 15 నెలల పాలనకు రెఫరెండంగా నిలిచిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి

  • కాంగ్రెస్‌ పాలనకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రెఫరెండం

  • పంటలు ఎండిపోవడానికి రేవంత్‌ రెడ్డి వైఫల్యమే కారణం

  • కృష్ణా నీటిని చంద్రబాబు ఏపీకి తరలిస్తుంటే మౌనం

  • మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం

హనుమకొండ టౌన్‌/జనగామ మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను తుక్కు తుక్కుగా ఓడించారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. 15 నెలల పాలనకు రెఫరెండంగా నిలిచిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు స్థలాన్ని పరిశీలించేందుకు సోమవారం హనుమకొండ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు హనుమకొండలో మరో చోట, జనగామలోనూ ప్రసంగించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి రేవంత్‌ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. పాలన చేతకాక రేవంత్‌ తెచ్చిన కరువు అని విమర్శించారు. దేవాదుల కాంట్రాక్టర్‌కు రూ.7 వేల కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులు పంపుల మోటార్లు ఆన్‌ చేయలేదని.. సరైన సమయంలో మోటార్లు ఆన్‌చేసి ఉంటే రిజర్వాయర్లు నిండి పొలాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు.


రేవంత్‌ వైఫల్యం కారణంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది నీటిని చంద్రబాబు ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కనీసం మాట్లాడలేదన్నారు. స్థానిక ఎన్నికలు సహా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎ్‌సదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇటీవల ఓ సభలో రేవంత్‌ ప్రధాని మోదీ మంచోడేనన్నారు. ఇప్పటికైనా కాంగ్రె్‌సలో బీజేపీ కోవర్టులెవరో రాహుల్‌ గాంధీ తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను వరంగల్‌ జిల్లాలో ఏప్రిల్‌ 27న ప్రారంభించి ఏడాది పాటు నిర్వహిస్తామని చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమం, 9 ఏళ్ల పాలన మేళవింపే ఈ సభ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, రాజయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 05:01 AM