Share News

Harish Rao: భూముల అమ్మకానికి సర్కార్‌ పన్నాగం

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:06 AM

భూములు అమ్మే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

Harish Rao: భూముల అమ్మకానికి సర్కార్‌ పన్నాగం

అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన రేవంత్‌, పొంగులేటి

తిరోగమన బాటలో తెలంగాణ: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూముల అమ్మకానికి కాంగ్రెస్‌ సర్కార్‌ పన్నాగం వేసిందని మాజీమంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. భూములు అమ్మే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఇంచు భూమిని కూడా అమ్మబోమని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి.. ఇప్పుడు రూ.వేల కోట్ల విలువైన భూములను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ పేరిట వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి గత నెల 28న టెండర్లు పిలవడం సర్కారు దిగజారుడు తనానికి పరాకాష్ఠ అన్నారు. తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌ అయిందని టెండర్‌ నోట్‌లో ప్రస్తావించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణను కాంగ్రెస్‌ 14 నెలల పాలనలో తిరోగమనం బాట పట్టించారని మంగళవారం ఎక్స్‌ వేదికగా హరీశ్‌రావు విమర్శించారు.

Updated Date - Mar 05 , 2025 | 04:06 AM