Share News

Group1: మా అవకాశాలకు దెబ్బ

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:38 AM

ఒకే జాబితాలో 17 మంది డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) క్యాడర్‌కు చెందిన స్పెషల్‌ గ్రేడ్‌, సెలెక్షన్‌ గ్రేడ్‌ అధికారులను కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సలుగా సీసీఎల్‌ఏ సిఫారసు చేయడంపై గ్రూప్‌-1 ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Group1: మా అవకాశాలకు దెబ్బ

  • ‘కన్ఫర్డ్‌’ల సిఫారసులపై గ్రూప్‌-1 ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఒకే జాబితాలో 17 మంది డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) క్యాడర్‌కు చెందిన స్పెషల్‌ గ్రేడ్‌, సెలెక్షన్‌ గ్రేడ్‌ అధికారులను కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సలుగా సీసీఎల్‌ఏ సిఫారసు చేయడంపై గ్రూప్‌-1 ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సగా సిఫారసుకు కావాల్సిన అర్హతలు డీటీల్లో కొందరికి లేకపోయినా వారికి అనుకూలంగా ఉండేలా తెలంగాణ సివిల్‌ సర్వీసు నిబంధనలు సవరించారని విమర్శిస్తున్నారు. సిఫారసు జాబితాలోకి ఎక్కువ మంది వచ్చేవిధంగా ఉద్యోగ విరమణ చేసిన వారిని, చనిపోయిన వారి సీనియారిటీని తొలగించారని ఆరోపిస్తున్నారు. అందునా.. సర్వీసు నిబంధనలను సవరిస్తే.. అవి, మార్పులు చేసిన రోజు నుంచే వర్తిస్తాయని, ప్రభుత్వం మాత్రం తెలంగాణ సివిల్‌ సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో ఈ నియమాన్ని పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర రెవెన్యూ సర్వీసు నుంచి ఎవరైనా కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ పొందాలంటే 56ఏళ్లలోపు వయసు, 8 ఏళ్ల పాటు వరుసగా డిప్యూటీ కలెక్టర్‌గా చేసి ఉండాలనే నిబంధన ఉందని.. 17 మందిలో కొందరి విషయంలో ఈ రూల్‌ పాటించలేదని విమర్శిస్తున్నారు. తాజా సిఫారసులతో 2017లో గ్రూప్‌-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్లుగా నేరుగా నియామకమైన తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.


మరో నాలుగు నెలల్లో తాము కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సకు అర్హత సాధించే అవకాశం ఉందని.. ఇంతలోపే డిప్యూటీ తహసీల్దార్‌ క్యాడర్‌లో నియామకమైన 17 మందిని సిఫార్సు చేస్తే తమ అవకాశాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే నిబంధనలను వర్తింపజేయాలంటూ 1995 తర్వాత డిప్యూటీ తహసీల్దార్లుగా నియామకమైన వారు కూడా కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ పదోన్నతుల కోసం పోటీ పడే అవకాశం ఉంటుందని.. దీని వల్ల గ్రూప్‌-1 ద్వారా డిప్యూటీ కలెక్టర్లుగా నియామకమయ్యే వారు నష్టపోయే ప్రమాదం తలెత్తుతుందని వాపోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక పదోన్నతుల విషయంలో శాశ్వత ప్యానల్‌ ఏర్పాటు కాలేదని.. తాత్కాలిక ప్యానల్స్‌ ద్వారా పదోన్నతులు పొందిన వారిని కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సకు ఎలా సిఫార్సు చేస్తారని 2017 బ్యాచ్‌ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 2026 జనవరిలో ఐఏఎస్‌ పొందాల్సిన 2017 గ్రూప్‌-1 అభ్యర్థులు మరో పదేళ్లపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి. సీనియారిటీ నిర్ణయించే ముందు ప్యానల్‌ నిర్ధారించకపోవడం, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించకుండా గుట్టు చప్పుడు కాకుండా సీసీఎల్‌ఏ కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ అభ్యర్థుల జాబితాను తయారు చేయడం అదికార వర్గాల్లో విమర్శలకు దారితీస్తోంది.

Updated Date - Aug 20 , 2025 | 04:38 AM