Bhatti Vikramarka: పరిశ్రమలకు త్వరలో హరిత ఇంధనం
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:17 AM
రాష్ట్రంలోని పరిశ్రమలకు త్వరలో హరిత ఇంధనాన్ని సరఫరా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
సింగిల్ టైమ్ సెటిల్‌మెంట్‌గా విద్యుత్ బిల్లుల పరిష్కారం
ఎఫ్‌టీసీసీఐ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో భట్టి
హైదరాబాద్, గన్‌పార్క్, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పరిశ్రమలకు త్వరలో హరిత ఇంధనాన్ని సరఫరా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన నగరంలోని ‘ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎ్‌ఫటీసీసీఐ)’ నూతన కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఫోర్త్ సిటీగా పరిగణిస్తోన్న ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ కాబోతుందని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊహకు అందదని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు, ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య ఐటీ, ఫార్మా, హౌజింగ్ వంటి క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామని, వాటిని అభ్యుదయ పారిశ్రామికవేత్తలకు కేటాయించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. తమది ప్రజల ప్రభుత్వమని, పారిశ్రామికవేత్తల కోసం ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు చిన్న సమస్య వచ్చినా స్పందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు యావత్తు మంత్రిమండలి సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు కోరినట్లు పెండింగ్‌లో ఉన్న విద్యుత్తు బిల్లులను సింగిల్ టైమ్ సెటిల్‌మెంట్ కింద పరిష్కరించే ఆలోచన చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ నగరం అత్యంత అనుకూలమైనదని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విదేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో రెప్పపాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతుందని, త్వరలో పరిశ్రమలకు ‘గ్రీన్ పవర్’ను సరఫరా చేసే ఆలోచన ఉందని తెలిపారు. ఎఫ్‌టీసీసీఐకి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, పరిశ్రమలకు ఒక మార్గదర్శిగా నిలిచిందన్నారు. హైదరాబాద్ వర్తక నగరంగా ఉన్న కాలం నుంచి అంతర్జాతీయ నగరంగా ఎదిగే ప్రతి దశలోనూ ఎఫ్‌టీసీసీఐ పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ వంటి ఆవిష్కరణల కేంద్రాల ద్వారా సంపద సృష్టించి, దాన్ని ప్రజలకు న్యాయంగా, సమానంగా పంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలబెట్టే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.