Share News

Govt to Recover All Due Rice: గింజ కూడా వదలం

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:59 AM

గడిచిన ఐదు సీజన్లకు సంబంధించి రైస్‌ మిల్లర్ల వద్ద 91 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిని మరాడించి..

Govt to Recover All Due Rice: గింజ కూడా వదలం

  • నిర్ణీత వ్యవధిలోనే సీఎంఆర్‌ బియ్యాన్ని రికవరీ చేస్తాం

  • గడువు దాటితే.. 25% జరిమానా, 12% వడ్డీ వసూలు చేస్తాం

  • ఇప్పటికే ధాన్యం అమ్ముకున్న రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు

  • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గడిచిన ఐదు సీజన్లకు సంబంధించి రైస్‌ మిల్లర్ల వద్ద 91 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిని మరాడించి.. ఒక్క బియ్యం గింజ కూడా బాకీ లేకుండా వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. ‘5 సీజన్లు.. కోటి మెట్రిక్‌ టన్నులు!’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై డీఎస్‌ చౌహాన్‌ వివరణ ఇచ్చారు. ‘‘2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి 18.98 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేయడానికి ఇందులో 1.5 లక్షల టన్నులు కేటాయించాం. 0.81 లక్షల టన్నులు సన్న బియ్యం పథకానికి కేటాయించాం. మిగిలిన 16.69 లక్షల టన్నులు రైస్‌ మిల్లర్ల వద్ద ఉండాలి. ఇందులో 5.40 లక్షల టన్నులు రైస్‌ మిల్లుల్లో లేదని గుర్తించాం. సదరు మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు చేశాం. ధాన్యం అమ్ముకున్న రైస్‌ మిల్లర్లు తమ ఆస్తులను బదిలీ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు ఖాతాలను కూడా నిలిపి వేశాం. మిగిలిన 11.29 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉంది. దీనిని మళ్లీ వేలం వేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. 2023-24 ఖరీఫ్‌, యాసంగికి సంబంధించి 5.06 లక్షల టన్నుల ధాన్యం బకాయిలు ఉన్నాయి. వీటికి సీఎంఆర్‌ డెలివరీ గడువు పూర్తయినందున 125 శాతం రికవరీ (25 శాతం జరిమానా), 12 శాతం వార్షిక వడ్డీ లెక్కన రైస్‌ మిల్లర్ల నుంచి వసూలు చేస్తాం. 2024-25 వానాకాలంలో 17.31 లక్షల టన్నుల ధాన్యం బకాయిలున్నాయి. మే 31వ తేదీకే సీఎంఆర్‌ డెలివరీ గడువు ముగిసిపోయింది. పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాం. కేంద్రం నుంచి అనుమతి వస్తే 17.31 లక్షల టన్నులు మరాడించి బియ్యం ఎఫ్‌సీఐకి పెడతాం’’ అని వివరించారు. 2024- 25 యాసంగి సీజన్లో 51.99 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఇటీవలే ముగిసిందని, సీఎంఆర్‌ డెలివరీ పురోగతిలో ఉందని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో బియ్యం రికవరీ చేస్తామని, గడువు దాటితే జరిమానా, వడ్డీతో సహా వసూలు చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 04:59 AM