Mid Day Meal Scheme: మధ్యాహ్న భోజనంలో 3 రోజులు రాగిజావ
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:28 AM
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం మెనూలో రాగిజావను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకం మెనూలో రాగిజావను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి వారంలో మూడురోజుల పాటు విద్యార్థులకు రాగిజావ అందించనుంది. అందుకవసరమైన రాగి పిండి, బెల్లం పొడిని సరఫరా చేసే బాధ్యతను శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టుకు అప్పగించింది. ప్రతి విద్యార్థికి 10 గ్రాముల రాగిపిండి, 10 గ్రాముల బెల్లం పొడి చొప్పున పాఠశాలలకు ట్రస్టు సరఫరా చేయనుంది. ట్రస్టు సహకారంతో రెండేళ్లుగా పాఠశాలలకు రాగిజావ పంపిణీ కొనసాగుతోంది.
అయితే ఈ కార్యాక్రమానికి అయ్యే వ్యయంలో 40 శాతం ప్రభుత్వం భరించాలని ట్రస్టు ప్రతిపాదించింది. తాజాగా ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. రాగిజావను వండి, వడ్డించే బాధ్యతలను ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న మహిళా సంఘాలకు అప్పగించింది. అదనంగా రాగిజావ వండినందుకు గాను విద్యార్థికి రోజుకు 25 పైసల చొప్పున ప్రభుత్వం వారికి ప్రోత్సాహకం అందించనుంది.