Metro expansion: గ్రీన్‌ఫీల్డ్‌పై మెట్రో రైల్!
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:57 AM
శంషాబాద్ విమానాశ్రయం నుంచి 40 కిలోమీటర్ల మార్గాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరుకునే విధంగా ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ మార్గంలో 18 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్‌లో భూమిపై(ఎట్‌గ్రేడ్)నే రైలు వెళ్లేవిధంగా డిజైన్ చేస్తున్నారు.

అత్యాధునిక ప్యూచర్‌సిటీ కారిడార్.. భూమిపై 18 కి.మీ., భూగర్భంలో 2 కి.మీ.
ఔటర్ రింగ్‌రోడ్డు వెంట 14 కి.మీ. మార్గం
వచ్చే నెలాఖరులోగా పార్ట్-బీ కారిడార్ల డీపీఆర్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు రెండో దశ విస్తరణలో కీలకమైన స్కిల్ యూనివర్సిటీ(ఫోర్త్‌సిటీ) కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 40 కిలోమీటర్ల మార్గాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరుకునే విధంగా ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ మార్గంలో 18 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్‌లో భూమిపై(ఎట్‌గ్రేడ్)నే రైలు వెళ్లేవిధంగా డిజైన్ చేస్తున్నారు. మొత్తం 40 కిలోమీటర్లలో దాదాపు సగ భాగం సాధారణ రైలు మాదిరిగా భూతలంపై మెట్రో పరుగులు తీయడం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. మరోవైపు 1,000-1,500 ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి హబ్‌ను అభివృద్థి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మెట్రో పార్ట్-ఏలోని 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఏఎంఎల్) నాలుగు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి పంపించగా.. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అయితే రెండో దశలో ప్రతిపాదించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు-స్కిల్‌వర్సిటీ(40 కిలోమీటర్లు), జేబీఎస్-మేడ్చల్(24 కిలోమీటర్లు), జేబీఎ్‌స-శామీర్‌పేట్(21 కిలోమీటర్లు) డీపీఆర్ తయారీపై హెచ్‌ఏఎంఎల్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. భూసేకరణ సమస్యలు ఎక్కడున్నాయి? స్టేషన్లను ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలివేటెడ్ కారిడార్లకు వచ్చే అడ్డంకులు, తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగం గా ఆదివారం హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మీర్‌ఖాన్‌పేట్‌లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ సర్వే చేశారు. కొంగరకలాన్ దాటిన తర్వాత సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో.. వారంతా కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుని వివిధ అంశాలను పరిశీలించారు.
పరిశీలనలో అధ్యయనం చేసిన అంశాలు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం ఎయిర్‌పోర్టు టర్మినల్ వద్ద మొదలై.. కొత్తగా ఏర్పాటు చేయనున్న మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్‌పోర్టు సరిహద్దు గోడ వెం బడి ఎలివేటెడ్ మార్గంగా.. మన్సాన్‌పల్లి రోడ్డు మీదుగా 5 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత.. పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌కి చేరేలా డిజైన్ చేస్తున్నారు.
ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్‌పోర్టు కార్గో వరకు 2 కిలోమీటర్లను అండర్‌గ్రౌండ్‌లో నిర్మించనున్నారు. కార్గోస్టేషన్ వద్ద డిపోనుఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా బహదూర్‌గూడలో ఉన్న దాదాపు 1,000- 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి హబ్‌ను తీర్చిదిద్దేందుకు బహదూర్‌గూ డా, పెద్ద గోల్కొండలో రెండు మెట్రోస్టేషన్లను అ త్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్నారు.
పెద్దగోల్కొండ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్‌గా, ఓఆర్‌ఆర్‌లో మెట్రోరైల్‌కి కేటాయించిన భాగంలో.. తక్కువ ఎత్తులో కారిడార్‌ను నిర్మించాలని భావిస్తున్నారు.
రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగూడా, మీర్‌ఖాన్‌పేట్ వరకు హెచ్‌ఎండీఏ సంస్థ 100 మీటర్ల(328 అడుగులు) వెడల్పున నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్ల(72 అడుగులు)ను మెట్రో రైల్‌కి కేటాయించారు. అయితే ఇక్కడ కేటాయించిన రోడ్డు మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ‘ఎట్ గ్రేడ్’(భూతలంపై) 18 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు.
ఈ విశాలమైన రోడ్డు మధ్యలో.. అదే లెవెల్‌లో మెట్రో రైలు ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల చొప్పున ప్రధాన రహదారి ఉంటుంది. మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లతో గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓఆర్‌ఆర్ నిర్మిస్తున్నప్పుడు.. ఓఆర్‌ఆర్‌లో అంతర్భాగంగా భవిష్యత్‌లో నిర్మించబోయే మెట్రోకు తగినంత స్థలాన్ని కేటాయించాలని తాను చేసిన ప్రతిపాదనను అంగీకరించి 20 మీటర్లు మెట్రోకి కేటాయించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అప్పట్లో అనేక మంది ఓఆర్‌ఆర్, మె ట్రో వంటి బృహత్ ప్రణాళికలు కాగితలకే పరిమితమవుతాయని, అవి ఆచరణ సాధ్యం కాదని అపహాస్యం చేశారని, ఇప్పుడు ఓఆర్‌ఆర్, మెట్రో రెండూ కార్యరూపుదాల్చాయని గుర్తుచేశారు.
నగరంలో రూ. 22 వేల కోట్లతో 69 కిలోమీటర్ల మేరకు మెట్రో మొదటిదశను పీపీపీ మోడల్‌లో పూర్తి చేశామని, ఇప్పుడు సీఎం దార్శనికతతో హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రోరైల్ సంస్థలు సంయుక్తంగా కృషిచేసి, రెండోదశను పూర్తిచేస్తాయని ఎన్‌వీఎ్‌స రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో దశలోని పార్ట్-బీలో ఉన్న మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లతోపాటు ఫ్యూచర్ సిటీ మెట్రో డీపీఆర్‌ను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వివరించారు.
ఎయిర్‌పోర్టు- స్కిల్ వర్సిటీ మార్గం..
మొత్తం దూరం : 40 కి.మీ.
స్టేషన్ల సంఖ్య : 16
భూగర్భ మార్గం : 2 కి.మీ.
ఎలివేటెడ్ మార్గం : 6 కి.మీ.
ఓఆర్‌ఆర్ వెంట ఎలివేటెడ్ : 14 కి.మీ.
ఎట్ గ్రేడ్(భూమిపై నిర్మాణం) : 18 కి.మీ.
ప్రధాన స్టేషన్లు : ఎయిర్‌పోర్టు, ఎయిర్‌పోర్టు కార్గో, బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల్, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్ యూనివర్సిటీ
కేవలం 40 నిమిషాల్లో ప్యూచర్‌సిటీకి..
ఎయిర్‌పోర్టు నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్‌సిటీకి చేరుకునే విధంగా కారిడార్‌ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి మొదలవుతున్న కారిడార్ రావిర్యాల మీదుగా, ఓఆర్‌ఆర్ వెంట వెళ్లే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీని కాలుష్యరహిత గ్రీన్‌సిటీగా తీర్చిదిద్ది, ప్రపంచంలోనే అద్భుత నగరాల వరసలో చేర్చే విధంగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు హెచ్‌ఏండీఏ, టీజీఐఐసీలతో కలిసి హెచ్‌ఏఎంఎల్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీ కి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూ చర్ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.