Share News

LPG Subsidy: ఈ కేవైసీ లేకపోతే గ్యాస్‌ సబ్సిడీ పథకం నిలిపివేత!

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:23 AM

గృహావసరాలకు వంట గ్యాస్‌ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన....

LPG Subsidy: ఈ కేవైసీ లేకపోతే గ్యాస్‌ సబ్సిడీ పథకం నిలిపివేత!

  • వినియోగదారులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి

  • ఉజ్వల లబ్ధిదారులు ప్రతియేటా కేవైసీ చేయాల్సిందే

  • పంపిణీదారులకు లక్ష్యాలు విధించిన ఆయిల్‌ కంపెనీలు

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గృహావసరాలకు వంట గ్యాస్‌ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం లబ్ధిదారులు ప్రతియేటా మార్చి 31 లోపు ఈ- కేవైసీ సమర్పించాలని కేంద్ర సర్కారు నిబంధన విధించింది. లేకపోతే సబ్సిడీ పథకాలు నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు ఆయిల్‌ కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ- కేవైసీ చేయిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల గృహ గ్యాస్‌ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 60 శాతం మంది మాత్రమే స్పందించారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) కంపెనీలు గృహ, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేస్తున్న విషయం విదితమే.

ఈ సంస్థలు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ పథకాలను అమలుచేస్తున్నాయి. ఉజ్వల పథఽకం లబ్ధిదారులు ప్రతియేటా ఒకసారి ఈ- కేవైసీ ఇవ్వకపోతే... ఏడాదిలో వారికిచ్చే 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్‌ కంపెనీలు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. బయోమెట్రిక్‌ ధృవీకరణ మార్చి 31 లోపు పూర్తికాకపోతే... ఈ సంవత్సరానికి సంబంధించి నిలిపివేసిన సబ్సిడీని శాశ్వతంగా రద్దుచేస్తామని స్పష్టంచేశారు. అయితే సబ్సిడీ రాకపోయినా గ్యాస్‌ సరఫరా, రీఫిల్‌ బుకింగ్‌కు అంతరాయం ఉండదని, మొత్తం ధర చెల్లించి సిలిండరు తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

.


ఎక్కడైనా చేయొచ్చు

వినియోగదారులు మొబైల్‌ యాప్‌ ద్వారా బయోమెట్రిక్‌ ఆధార్‌ ధృవీకరణ చేసుకునే అవకాశం కల్పించారు. క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి మొబైల్‌ ద్వారా చేసుకోవచ్చు. సంబంధిత ఏరియా పంపిణీకేంద్రానికి వెళ్లి చేసుకోవచ్చు. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకొచ్చే డెలివరీ సిబ్బంది కూడా ఈ- కేవైసీ నమోదు చేస్తున్నారు. వినియోగదారుల నుంచి స్పందన సరిగాలేదని ఆశించిన స్థాయిలో పూర్తికావటం లేదని పంపిణీదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల నుంచి ఈ- కేవైసీ తీసుకోకపోతే జరిమానా వేస్తామని డిస్ట్రిబ్యూటర్లకు ఆయిల్‌ కంపెనీలు హెచ్చరికలు జారీ చేశాయి. వినియోగదారులతో పలు సమస్యలు ఎదురవుతున్నాయని, ఆయిల్‌కంపెనీలు పంపిణీదారులపై ఒత్తిడి చేయటం సరైన చర్యకాదని అఖిల భారత గ్యాస్‌ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు.

ఇవీ చదవండి:

Indias IT Market: 2030 నాటికి రూ.35.32 లక్షల కోట్లు

Apples Market Value: యాపిల్‌ 4 లక్షల కోట్ల డాలర్లు

Updated Date - Oct 30 , 2025 | 08:38 AM