కొండపర్తికి బ్రాండ్ ఇమేజ్ తెస్తాం
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:05 AM
ఈ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన తన దత్తత గ్రామమైన కొండపర్తిని సందర్శించారు.

దేశానికి రోల్ మోడల్‌గా గ్రామాన్ని తీర్చిదిద్దుతాం
కారం, మసాలా ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తాం
దత్తత గ్రామ సందర్శనలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ములుగు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లోని ఓ కుగ్రామంలో పాల ఉత్పత్తిని ప్రారంభించి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమూల్ సంస్థ తరహాలో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ చిన్న అటవీ గ్రామమైన కొండపర్తికి కారం, మసాలా దినుసుల ఉత్పత్తితో బ్రాండ్ ఇమేజ్ సాధిస్తామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఈ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన తన దత్తత గ్రామమైన కొండపర్తిని సందర్శించారు. రూ. 1.45 కోట్ల నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, మిర్చి, మసాలా తయారీ, కుట్టుమిషన్ యూనిట్లను గవర్నర్ ప్రారంభించారు. పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. గ్రామ కూడలిలో కుమ్రంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ వికసిత భారత్ సంకల్పానికి చిన్న గ్రామమైన కొండపర్తి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కొండపర్తిని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టుసాధించేలా దిశ సంస్థతో కలిసి వంద పాఠశాలల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కొండపర్తిలో 150 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిన మిర్చి, పసుపు సాగు చేయిస్తామని చెప్పారు. గ్రామంలో వంద శాతం ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమం అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ, వనదేవతల గద్దెలను దర్శించుకున్న గవర్నర్ పూజలు చేశారు.