Rangareddy: అద్దె కట్టలేదని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తాళం
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:08 AM
గత 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మహేశ్వర ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని యాజమాన్యం తాళం వేసింది. కలెక్టర్, ఆర్డీవో జోక్యంతో తాళాలు తీసి తరగతులు కొనసాగాయి
గంటన్నర పాటు ఆరుబయటే ఉన్న విద్యార్థులు, ఫ్యాకల్టీ
కలెక్టర్, ఆర్డీవో జోక్యంతో తాళాలు తీసిన భవన యజమాని
ఆదిభట్ల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): అద్దె కట్టలేదని ప్రభుత్వ మెడకల్ కళాశాలకు భవన యాజమాన్యం తాళం వేసింది. దీనితో వైద్య విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందిపడ్డారు. కలెక్టర్, ఆర్డీవో జోక్యంతో తాళాలు తీశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఈ సన్నివేశం చోటు చేసుకుంది. మంగల్‌పల్లి సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనికి గతేడాది ఆగస్టు నుంచి నెలకు రూ.16 లక్షల చొప్పున అద్దె చెల్లించాలి.
8 నెలల అద్దె రావాల్సి ఉందంటూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం.. వైద్య కళాశాల తరగతి గదులకు తాళాలు వేశారు. వైద్య కళాశాల బోర్డునూ తొలగించారు. దీనితో మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ బయటే ఉండిపోయారు. ఈ విషయం కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి వెళ్లడంతో.. సమస్యను పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి సూచించారు. ఆర్డీవో భవన యాజమాన్యంతో మాట్లాడారు. వారంలో అద్దె సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనితో యాజమాన్యం తాళాలు తీయగా.. వైద్య కళాశాల తరగతులు కొనసాగాయి.