సాగునీటి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:54 PM
సాగునీటి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.

శాలిగౌరారం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సాగునీటి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం లోని అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పేజ్-1 ప్రతిపాదిత స్థలాన్ని గురువారం పరిశీలించారు. అయిటిపాముల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి శాలిగౌరారం మండలంలోని వల్లాల, పెర్కకొండారం గ్రామాల వరకు సాగునీరు అందించేందుకు రూ.101.62కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లిప్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే వల్లాల గ్రామంలో 1529 ఎకరాలు, పెర్కకొండారంలో 800ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. కాల్వల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుతో కాల్వల ద్వారా అమ్మనబోలు, ఎన్‌జీ కొత్తపల్లి నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి కూడా నీరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏఈ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమరంరెడ్డి, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచులు షేక్ ఇంతియాజ్ ఆహ్మద్, భూపతి మంగమ్మ వెంకన్న, బొడిగె వెంకటేశ్వర్లు, మార్కెట్ డైరెక్టర్లు దేవరకొండ జయరాజు, పడాల రమేష్, గైగుళ్ల అవిలయ్య తదితరులు పాల్గొన్నారు.