Share News

Warangal: కాంగ్రెస్‌ నేత లైంగికంగా వేధిస్తున్నాడు

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:26 AM

అధికార పార్టీ నాయకుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని..

Warangal: కాంగ్రెస్‌ నేత లైంగికంగా వేధిస్తున్నాడు

  • అతడితో పాటు తహసీల్దార్‌పై చర్యలు తీసుకోండి

  • ఆఫీసులో పురుగుల మందు తాగిన ఉద్యోగిని

నల్లబెల్లి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ నాయకుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆఫీసులోనే పురుగుల మందు తాగింది. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ వాంకుడోతు కల్పన సోమవారం ఈ దారుణానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను తహసీల్దార్‌ కారులో నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సూసైడ్‌ నోట్‌ రాసిన బాధితురాలు.. సోషల్‌ మీడియాలో దాన్ని పోస్ట్‌ చేసింది. బిల్‌నాయక్‌ తండాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మాలోతు చరణ్‌సింగ్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.


అలాగే తన పనితీరు సరిగా లేదని, శాఖాపరమైర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడని వెల్లడించింది. దీనిపై తహసీల్దార్‌ ముప్పు కృష్ణను సోమవారం కార్యాలయంలో సంప్రదించగా.. చరణ్‌సింగ్‌తో మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కార్యాలయంలోనే పురుగుల మందు తాగానని పేర్కొంది. దీనిపై విచారణ జరిపి చరణ్‌సింగ్‌, తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని విన్నవించింది.

Updated Date - Sep 09 , 2025 | 05:26 AM